వైవీయూ, న్యూస్‌లైన్: రాయలసీమ పాలిటెక్నిక్ అధ్యాపకుల జేఏసీ ఏర్పాటైంది. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం రాయలసీమకు చెందిన 34 కళాశాలల నుంచి 74 మంది ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్‌గా కడప పాలిటెక్నిక్ కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి ఎన్. రాఘవరెడ్డిని ఎన్నుకున్నారు.
అలాగే అనంతపురం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. సూర్యనారాయణరెడ్డిని కన్వీనర్‌గా, కడపకు చెందిన ఎం. తిప్పేస్వామిని ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కార్యచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా రెండు మూడు రోజుల్లో రీ షెడ్యూలు వస్తే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటామని తెలిపారు. అలాగే సెప్టెంబర్ 10వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి నోటీసును త్వరలో ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, లైబ్రేరియన్‌లు, పీడీలు, ఏఓలు పాల్గొన్నారు.