రాజుగారి మొత్తం ఖర్చు 4 లక్షలే!!
లోక్సభ ఎన్నికల్లో నాయకులు ఒక్కొక్కరు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో లెక్కలేదు.అనధికారికంగా అసెంబ్లీ నియోజకవర్గాలకే రెండు మూడు కోట్లు ఖర్చు అయినట్లు ఎన్నికల సమయంలో చెప్పుకొన్నారు. కానీ, నాయకులు ఎన్నికల కమిషన్కు సమర్పించిన లెక్కలు చూస్తే మాత్రం కళ్లు తిరగక తప్పదు. కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయానశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్ గజపతి రాజు.. తన ఎన్నికల ఖర్చు మొత్తం కలిపినా నాలుగు లక్షలేనని తేల్చిచెప్పారు! తనకు అయిన మొత్తం ఖర్చు రూ. 4,10,280 మాత్రమేనని ఆయన ఎన్నికల కమిషన్కు లెక్కలు వివరించారు. ఆయనే కాదు.. పలువురు టీడీపీ ఎంపీలు ఇదే బాటలో నడిచారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి 18,92,831 రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టినట్లు చూపించారు.
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) 24,44,142 రూపాయలు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ 29,17,518 రూపాయలు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ 53,56,255, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు 60,88,031 రూపాయలు ఖర్చు చేసినట్లు ఎన్నికల లెక్కల్లో చూపించారు.
ఇక ఇటు గజ్వేల్ అసెంబ్లీకి, మెదక్ లోక్సభ స్థానానికి కూడా పోటీచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు తన మొత్తం ఖర్చు 46 లక్షలు మాత్రమేనని ప్రకటించారు. అందులో ఆయన హెలికాప్టర్ పర్యటనలకు అంతా కలిపి రూ. 3.75 లక్షలు మాత్రమే ఖర్చుపెట్టారట!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినాయకుడు చంద్రబాబునాయుడికి అయిన ఖర్చు మరీ తక్కువ. ఆయనకు అంతా కలిపి 20.89 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చయిందట. అందులోనూ ఆయన హెలికాప్టర్కు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదన్నారు.
లోక్సభ నియోజకవర్గానికి గరిష్ఠంగా 70 లక్షల రూపాయలు, అసెంబ్లీ నియోజకవర్గానికి గరిష్ఠంగా 28 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టుకోవచ్చని ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో హెలికాప్టర్లకుడ డిమాండ్ ఎక్కువ ఉండటంతో వాటికి ఒక్క గంటకే ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు తీసుకున్నారు.