విషమంగానే ఎస్‌ఐ సిద్ధయ్య ఆరోగ్యం
వెంటిలేటర్‌పై కృత్రిమ శ్వాస
కామినేని ఆస్పత్రిలో సిద్ధయ్యను
పరామర్శించిన సీఎం కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
హైదరాబాద్: సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూర్(ఎం) ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య (29) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యానికి ఆయన శరీరం ఏమాత్రం సహకరించట్లేదని, మెదడు పనితీరులో ఎలాంటి పురోగతి లేదని గత మూడు రోజులుగా ఆయనకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందం స్పష్టం చేసింది. మరో రెండు రోజులు గడిస్తేకానీ ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉదయం మెడికల్ బులెటన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు వివరించింది.
మెదడులోని బుల్లెట్‌ను ముట్టుకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదమని, ప్రస్తుత పరిస్థితుల్లో దాని జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక మరోసారి శస్త్రచికిత్స చేసి పొత్తికడుపు, చిన్నమెదడులో ఉన్న బుల్లెట్లను తొలగించనున్నట్లు తెలిపింది. మరోవైపు సిద్ధయ్యను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఎంత ఖర్చైనా భరించి సిద్ధయ్య ప్రాణాలను కాపాడతామని సిద్ధయ్య సోదరుడు దస్తగిరికి హామీ ఇచ్చారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రికి ఉత్తమ వైద్య నిపుణులను రప్పించడమో లేదా మెరుగైన వైద్యం కోసం మరెక్కడికైనా తరలించడమో చేస్తామన్నారు. సీఎం వెంట ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు ఉన్నారు. కాగా, కేసీఆర్ రాకకు ముందే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆస్పత్రికి చేరుకొని ఎస్‌ఐ సిద్ధయ్యను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులు, ఇతర బంధువులను ఓదార్చారు. జగన్ వెంట వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడి ఇదే ఆస్పత్రిలో చేరిన రామన్నపేట సీఐ బాలగంగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో వైద్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి: టీ టీడీపీ
ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన పోలీసులకు రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులుతో కలసి కామినేని ఆస్పత్రిలో ఎస్‌ఐ సిద్ధయ్యను పరామర్శించిన అనంతరం ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు తెలంగాణ పౌరుషాన్ని చూపారన్నారు.
ఎంత ఖర్చు అయినా భరిస్తాం హోంమంత్రి నాయిని
ఎస్‌ఐ సిద్ధయ్యను బతికించుకునేందుకు ఎంత ఖర్చైనా భరిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం కామినేని ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిద్ధయ్యకు చికిత్స అందించేందుకు దేశ, విదేశాల్లోని వైద్యులను రప్పించేందుకూ సిద్ధమన్నారు. ముష్కరులను తొలుత దోపిడీ దొంగలుగా భావించామని, అనంతర పరిణామాల దృష్ట్యా వారు ఉగ్రవాదులని తేల్చామన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతులైన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు.