
అధ్యక్షా..
గుంటూరు జిల్లాకు మరో కీలక పదవి లభించింది. జిల్లాలోని సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి వరించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆ పదవి జిల్లాకే దక్కగా టీడీపీ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది.
మళ్లీ మన జిల్లాకే సభాపతి స్థానం
సత్తెనపల్లి ఎమ్మెల్యేని వరించిన అసెంబ్లీ స్పీకర్ పదవి
డాక్టర్ కోడెలది మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
12 ఏళ్లపాటు మంత్రిగాపనిచేసిన ఘనత
ఫలించని పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ప్రయత్నాలు
గుంటూరు :గుంటూరు జిల్లాకు మరో కీలక పదవి లభించింది. జిల్లాలోని సీనియర్ నేత, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి వరించింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆ పదవి జిల్లాకే దక్కగా టీడీపీ ప్రభుత్వం కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఐదుసార్లు సొంత నియోజకవర్గం నరసరావుపేట, మొన్నటి ఎన్నికలో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా
కోడెల గెలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిమంత్రివర్గ విస్తరణలోనే కోడెలకు మంత్రి పదవి లభిస్తుందనే అభిప్రాయం పార్టీలో వినపడింది. అందరి అంచనాలకు భిన్నంగా బాబు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్‌లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ల అభిమానులు అధినేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దూళిపాళ్ల అనుచరులైతే ఆయన స్వగ్రామం చింతలపూడిలో ధర్నా నిర్వహించారు. మంగళగిరిలో జరిగిన సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకాకుండా నరేంద్రను ఆపేందుకు ప్రయత్నించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఆయన స్వగ్రామానికి వెళ్లే బుజ్జగించి కార్యక్రమానికి తీసుకువచ్చారు. జూనియర్లు అయిన ప్రత్తిపాటికి, రావెలకు మంత్రి పదవులు కేటాయించడంతో కోడెల, ఆయన అభిమానులు అధినేత పట్ల కినుక వహించినా, రెండో విడత మంత్రివర్గం విస్తరణపై ఆశతో ఎదురు చూశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పదవి కోసం కోడెల చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
కోడెల రాజకీయ ప్రస్థానం.. డాక్టర్ కోడెల శివప్రసాదరావు నకరికల్లు మండలం కర్లకుంట గ్రామంలో జన్మించారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పీజీ డిగ్రీని బెనారస్ మెడికల్ హిందూ యూనివర్సిటీలో చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించి 1983లో కాంగ్రెస్ అభ్యర్థి బూచిపూడి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. అప్పటి నుంచి ఐదుమార్లు వరుసగా 1985 మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, 1989లో డాక్టర్ ముండ్లమూరి రాధాకృష్ణమూర్తి, 1994లో దొడ్డా బాలకోటిరెడ్డి, 1999లో కాసుపై విజయం సాధించారు. 2004, 2009లో కాసుపై రెండుమార్లు కోడెల పరాజయం పొందారు. 2014లో సత్తెనపల్లి నుంచి పోటీచేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబుపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కోడెల సుమారు 12ఏళ్లపాటు మంత్రిగా పనిచేశారు. హోంశాఖామంత్రి, పౌరసరఫరాలు, వైద్యఆరోగ్య, భారీ నీటి పారుదల, పంచాయతీరాజ్ శాఖా మంత్రులుగా పనిచేశారు.
సభాపతి మళ్లీ గుంటూరుకే... పార్టీలు వేరైనా పదవుల కేటాయింపులో కాంగ్రెస్, టీడీపీల నిర్ణయాలు ఒకే రకంగా ఉంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ పదవి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు లభించగా, ఇప్పటి టీడీపీలోనూ సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెలను వరించింది. వ్యవసాయశాఖ కేటాయింపులోనూ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు కేటాయిస్తే, టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు కేటాయించింది.
రాజధానికి తగిన ప్రాధాన్యత... విజయవాడ- గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు కానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు తొలి మంత్రివర్గ విస్తరణలో సరైన ప్రాతినిధ్యం లభించలేదనే విమర్శలు వినపడ్డాయి. కృష్ణా జిల్లాకు బీజేపీతో కలిపి మూడు మంత్రి పదవులు లభించగా, గుంటూరుకు రెండు పదవులే లభించాయి. స్పీకర్ పదవి కేటాయింపుతో ఆ లోటును కూడా భర్తీ చేశారని పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోడెలకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి కేటాయించడంలో బాబు రాజకీయ చతురత చూపారని కొందరు భావిస్తున్నారు. సంగం డైరీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర స్పీకర్ పదవి కోసం ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు.