కింజరాపు అచ్చెన్నాయుడు
‘ఆఫీసులో తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ము ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా’- సరుబుజ్జిలి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శికి మాజీ విప్ కూన రవికుమార్ బెదిరింపులివి.. ‘‘ఏయ్.. ఎగస్ట్రా చేయొద్దు. నీకు ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్‌లెస్ ఫెలో’’ - తాజాగా రాజధానిలో పోలీసు ఉన్నతాధికారులకు చేయి చూపిస్తూ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు వేసిన చిందులివి..
ఎంపీడీఓను బెదిరించిన కేసులో కూన రవికుమార్ ఇంకా అరెస్టు కాలేదు. గత నెల 27వ తేదీ నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన మరవకముందే సాక్షాత్తు ఎస్పీ విక్రాంత్ పటేల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నోరు పారేసుకున్నారు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. చేయి చూపిస్తూ తన సహజ ధోరణిలో బెదిరించారు. ఈ ఘటన చూసిన సిక్కోలు ప్రజలు నివ్వెరపోయారు. ఆయనకెందుకంత నోటి దురుసు అంటూ అసహ్యించుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం దిగిపోయినా... ఇంకా అధికారంలో ఉన్నామనే మదం చూపిస్తున్నారు. ఒక్క అచ్చెన్నాయుడు, కూన రవికుమారే కాదు టీడీపీ నేతలు చాలావరకు నోటిని అదుపులో పెట్టకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా ఇప్పటికీ అధికారులు తమ చెప్పుచేతల్లో ఉండాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరి తీరుతో జిల్లాకు చెడ్డపేరు వస్తోంది. శాంతి కాముకులన్న పేరు గల జిల్లాకు చెందిన నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారేంటని బాధపడాల్సిన పరిస్థితి నెలకుంది. సాధారణంగా దేశం నలుమూలల సిక్కోలు ప్రజలుంటారు. ఉపాధి కోసం వలస వెళ్లి బతుకుతారు. జిల్లావాసులు దేశంలో ఎక్కడైనా బతకగలరు. దానికి కారణం ప్రవర్తనే. అందరితో మంచిగా ఉంటూ, కలివిడిగా నడుస్తూ జీవిత ప్రయాణం చేస్తుంటారు. అందుకనే శ్రీకాకుళం జిల్లా వాసులంటే ఇతర ప్రాంతాల వారికి ఒక నమ్మకం. కానీ అచ్చెన్నాయుడు, రవికుమార్ లాంటి నేతలు ఓవర్ యాక్షన్ చేయడంతో శ్రీకాకుళం జిల్లా నేతలు ఇలాంటి వాళ్లా? అని పెదవి విరిచే పరిస్థితి ఏర్పడింది.
అధికారంలో ఉన్నంతకాలం అచ్చెన్నాయుడు బెదిరింపులతోనే పబ్బం గడిపారు. భయపెట్టి, అధికారులను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించారు. దర్జాగా దోపిడీకి పాల్పడ్డారు. మంత్రి హోదాలో జిల్లాలో చాలామంది ఉన్నతాధికారులపై సైతం ఏకవచన ప్రయోగం, పరుష పదజాలంతో మండిపడటం, బెదిరించడం తెలిసిందే. టెక్కలి డివిజన్‌కు చెందిన ఓ ఆర్‌అండ్‌బి ఉద్యోగిపై దాడికి పాల్పడటం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యింది. రిమ్స్ డైరెక్టర్లుగా పనిచేసిన ఉన్నత వైద్యాధికారులపై ఏకవచన ప్రయోగం చేశారు. గతంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో నిమ్మాడలో తమకు వ్యతిరేకంగా పనిచేశారని ప్రత్యర్ధిపై అమర్యాదగా వ్యవహరించారు. పోలింగ్ అధికారులను బెదిరించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక, ఎన్నికల ముందైతే ఓటర్లనే నేరుగా బెదిరించారు.
గత నెల 24న కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి కార్యాలయంలో ఎంపీడీవో రాజేశ్వరమ్మపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు తెలియకుండా వాలంటీర్లు నియమించారని, సమాచారం ఇవ్వలేదని, అలాగే పింఛన్లు ఎలా తొలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా పోలీసు ఉన్నతాధికారిపై నోరు పారేసుకున్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా రాజధానిలో అచ్చెన్న వీరంగం సృష్టించారు. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ అంటూ పోలీసులపై ఒంటికాలితో లేచారు. అంతటితో ఆగకుండా ఎస్పీ విక్రాంత్ పటేల్‌ను ‘యూజ్‌లెస్ ఫెలో’ అని దుర్భాషలాడారు.
ఇదంతా చూస్తుంటే అచ్చెన్నాయుడు తదితర నేతల్లో అసహనం తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఒక్కొక్కరిగా టీడీపీ కీలక నేతలు తమ స్వరూపాన్ని నేరుగా బయటపెట్టుకుంటున్నారు. ఏకవచన ప్రయోగాలతోపాటు అవమానకర ప్రవర్తన చేస్తూనే.. నేరుగా బెదిరింపులకు దిగుతున్నారు. అచ్చెన్న వ్యవహారం రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నంతసేపూ అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడి... తనకంటూ ఒక చెడ్డ పేరును మూటగట్టుకున్నారో ఇప్పుడు కూడా ఆ పేరును నిలబెట్టుకునేలా దౌర్జన్యాలకు దిగుతున్నారు. (చదవండి: చంద్రబాబు డైరెక్షన్.. బయట నేతల ఓవరాక్షన్)
Comments
Please login to add a commentAdd a comment