రూ.20 లక్షలకు పైగా దుర్వినియోగం!!
పాత తాళం కప్పలకు కొత్త వసూళ్లు
ఆందోళనలో హాస్టల్ విద్యార్థులు
విశాఖపట్నం: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాళం కప్పల బాగోతం కలకలం రేపుతోంది. తమ నుంచి యాజమాన్యం రూ.లక్షలు దోచుకుంటోందంటూ విద్యార్థి వర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాత తాళాలను అంటగడుతూ కొత్త వాటి ధరలను ఏటా వసూలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర యూనివర్సిటీలో ఏటా వివిధ హాస్టళ్లలో 2600 మందికి పైగా అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రవేశ సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి తాళం కప్పల నిమిత్తం రూ.150 వసూలు చేసేవారు. ఇలా ఒక్కో హాస్టల్ గదిలో ఇద్దరు ముగ్గురు, లేడీస్ హాస్టళ్లలో ఐదుగురు చొప్పున ఉంటారు. ఈ లెక్కన ఒక్కో గదికి రూ.300-750 వరకు వసూలవుతుంది. ఆ సొమ్ముతో వారికి కొత్త తాళం కప్పలు ఇవ్వాలి. కానీ అలాకాకుండా అంతకు ముందు వాడిన వాటినే రొటేషన్‌లో వీరికిస్తున్నారు. లేడీస్ హాస్టల్, ఇంజినీరింగ్ గరల్స్, బాయ్స్ హాస్టళ్లల్లో కొంతమందికి పాత తాళం కప్పలు కూడా ఇవ్వడం లేదని దీంతో తామే వాటిని కొంటున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ ఆ సొమ్మును వారి నుంచి వసూలు చేసేస్తున్నారు. ఈ వ్యవహారం 2010 నుంచి కొనసాగుతూ వస్తోంది. దీనిపై కొంతమంది హాస్టల్ విద్యార్థులు కొన్నాళ్ల క్రితం రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లగా రూ.150ను 100కు తగ్గించారు. దీంతో 2015 నుంచి రూ.100లు వసూలు చేస్తున్నారు.
2010 నుంచి వసూళ్ల లెక్కలను పరిశీలిస్తే..
మహారాణిపేట లేడీస్ హాస్టల్లో ఏటా 650 మంది కొత్తగా చేరుతుంటారు. వీరి నుంచి ఈ నాలుగేళ్లలో రూ.3.90 లక్షలు, 2015-16కి రూ.65 వేలు వెరసి రూ.4.55 లక్షలు వసూలు చేశారు. అలాగే ఆర్ట్స్, కామర్స్ హాస్టల్ విద్యార్థులు 761 మంది నుంచి రూ.5.30 లక్షలు, సైన్స్ హాస్టల్‌లో 400 మంది నుంచి రూ.2.80 లక్షలు బాయ్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు 800 మంది నుంచి సుమారు రూ.5.60 లక్షలు, గరల్స్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లో 425 మంది నుంచి రూ.3 లక్షలు వెరసి సుమారు రూ.21 లక్షల వరకూ తాళం కప్పల సొమ్ము కింద ఏయూ యాజమాన్యం వసూలు చేసినట్టు అంచనా. వాస్తవానికి ఒక తాళం కప్ప ఖరీదు గరిష్టంగా రూ.150లకు మించదు. అది రెండు మూడేళ్ల వరకూ పనికొస్తుంది. అయినా ఏటా విద్యార్థినీ విద్యార్థుల నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు. తాళం కప్పల కొనుగోలు నిమిత్తం వసూలు చేసిన ఈ సొమ్ము దానికి వినియోగించ కుండా దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై సరైన లెక్కాపత్రం లేదని సమాచారం. ఇన్నాళ్లూ సాగిన తాళాల వ్యవహారం ఇటీవల విద్యార్థుల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు.
లోపాలను సరిచేస్తాం..
హాస్టల్ విద్యార్థులు ఏయూ యాజమాన్యానికి మెస్ బిల్లులు రూ.82 లక్షలు బకాయి పడ్డారు. ఇందులో రూ.22 లక్షలు చెల్లించగా ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నారు. బకాయిలుంటే హాస్టళ్లు నడపడం కష్టం. అందువల్ల తాళం కప్పల సొమ్మును హాస్టళ్ల నిర్వహణకు వెచ్చిస్తున్నారేమో? ఒకవేళ దుర్వినియోగం చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి లోపాలను సరిచేస్తాం.
- వి. ఉమామహేశ్వరరావు, రిజిస్ట్రార్, ఏయూ
ఏయూలో తాళాల బాగోతం!
Published Mon, Feb 22 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM
Advertisement
Advertisement