తీవ్రవాదుల చేతిలో అసువులు బాసిన పోలీసు కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకు ఆడిటోరియం నిర్మిం చడం అభినందనీయమని డీజీపీ ప్రసాదరావు అన్నారు.
జిల్లాతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్న పోలీస్‌బాస్
సాక్షి, నల్లగొండ
తీవ్రవాదుల చేతిలో అసువులు బాసిన పోలీసు కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకు ఆడిటోరియం నిర్మిం చడం అభినందనీయమని డీజీపీ ప్రసాదరావు అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 1.50 కోట్లతో నిర్మించిన ఎమిలినేటి మాధవరెడ్డి పోలీసు ఆడిటోరియం భవనాన్ని గురువారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. తీవ్ర వాదుల చేతి లో జిల్లాకు చెందిన పోలీసులే ఎక్కువ మంది చనిపోయారని పేర్కొన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. 1992-93లో తాను జిల్లా ఎస్పీ గా పనిచేసినపుడు సాగునీటి వనరులు పెరగలేదని, ఫ్లోరిన్ సమస్య ఉండేదని గుర్తుచేశారు.
నల్లగొండ జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత హోంమత్రి మాధవరెడ్డితో ఉన్న అనుబంధంతోనే పోలీసు అమరుల కుటుంబాల పిల్లలను ఆదుకునేందుకే ఆడిటోరియం నిర్మాణానికి కృషిచేసినట్లు చెప్పారు. ఆడిటోరియానికి ఒక కమిటీని నియమించి వచ్చే ఆదాయం తో అమరుల కుటుంబాలకు తోడ్పాటునందిస్తామన్నారు. వారంలోపు మిర్యాలగూడెంలో మరో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ ఆడిటోరియాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 14 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భవనాన్ని పట్టుదలతో పూర్తిచేయడం అభినందనీయమన్నారు. శిథిలావస్థకు చేరిన పోలీస్‌క్వార్టర్స్ స్థానంలో క్వార్టర్స్ నిర్మించేందుకు చొరవ చూపాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్‌రావు, దిలీప్‌కుమార్, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశిధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
డీజీపీకి ఘన సన్మానం
పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీజీపీ ప్రసాదరావును సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, అమర్‌సింగ్, ఉపేందర్, స్వామి, సోమయ్య ఉన్నారు.
బెటాలియన్‌లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
నల్లగొండ మండలం అన్నెపర్తి బెటాలియన్‌లో *10 లక్షలతో నిర్మించే రోడ్డుకు డీజీపీ ప్రసాదరావు గురువారం శంకుస్థాపన చేశారు. బెటాలియన్ సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బెటాలియన్‌లో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ టి.చిరంజీవులు, ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ శశీధర్‌రెడ్డి, ఎస్పీ ప్రభాకర్‌రావు, కమాండెంట్ బాబూజీ రావు, సీతారాం ఉన్నారు.