అయ్యన్నపాత్రుడు , గంటా మధ్య విభేదాలు
- మరోసారి బయటపడ్డ అయ్యన్న, గంటా మధ్య విభేదాలు
- సమీక్షకు గంటా మూడు గంటలు ఆలస్యం
- అయ్యన్న అసహనం
- పరస్పరం విసుర్లు
సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే వేదికపై పక్కపక్కనే కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించే వీరిద్దరూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆదివారం ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన సమీక్షలో తేటతెల్లమైంది. సీఎం చంద్రబాబు ఈ నెల 30, 31 తేదీల్లో జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి అయ్యన్న ఉదయం 10 గంటలకే ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. మంత్రి గంటా మాత్రం సమావేశం ఉందని తెలిసీ గంభీరం పర్యటనకు వెళ్లిపోయారు. దీంతో అయ్యన్న గంటా ఎంతసేపటికీ రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్‌తోపాటు అధికారులంతా గంటా వెనుకే వెళ్లడంతో అయ్యన్న వద్ద ఒక్క జిల్లా అధికారి మినహా మరెవరూ లేరు. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండడంతో వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని ఆయన బయటకు వచ్చేశారు.
ఈలోగా గంటా రావడంతో ఆయన్ను ఉద్దేశించి ‘ఏం మంత్రిగారు.. మమ్మల్ని మూడు గంటలు నిరీక్షింపచేస్తారా’? అని ప్రశ్నించగా, ‘నువ్వు కూడా నన్ను గతంలో చాలా వెయిట్ చేయించావు కదా’ అని గంటా బదులిచ్చి నేరుగా లోపలికి వెళ్లిపోయారు. అనంతరం ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా సమావేశం ముగించారు.
నవ్వులు విరిశాయ్... చేతులు కలుస్తాయా?
అవును... మీరు చూస్తున్నది మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావులనే. ఈ చిత్రం ఆదివారం సాయంత్రం చోడవరంలో కనిపించింది. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల సమీక్షకు చోడవరం వచ్చిన వీరు స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు కార్యాలయంలో పక్కపక్కనే కూర్చున్నారు.
చలోక్తులు వేసుకొని నవ్వుకున్నారు. గంటా ముందు ముభావంగానే ఉన్నా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే రాజుపై చలోక్తులు వేయడంతో గంటాతో పాటు ఎంపీ ముత్తంశెట్టి కూడా చిరునవ్వు చిందించారు. దీంతో రాజు కాస్త చిన్నబుచ్చుకున్నట్లు కనిపించినా తర్వాత ఆయన కూడా నవ్వులు కలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో చర్చలో మాత్రం గంటా ఆధిక్యం ప్రదర్శించడంతో అయ్యన్న వినడానికే పరిమితమయ్యారు.
అంతకు ముందు ఎమ్మెల్యే కార్యాలయంలో మంత్రులిద్దరూ వేర్వేరుగా విలేకరుల సమావేశం నిర్వహించడం గమనార్హం. మీ శాఖలో నేను వేలుపెట్టలేదంటూ అయ్యన్న చెబితే... ఈ విషయం ఫోన్‌లో అడిగావు కదా అంటూ గంటా సమాధానమివ్వడం ఈ పర్యటనలో కొసమెరుపు. మరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కలసినట్టేనా అంటే ఏమో అనే సంశయమే ఇంకా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
- చోడవరం టౌన్
చెప్పింది చాల్లే.. : ముత్తంశెట్టిపై గంటా విసుర్లు
విశాఖపట్నం : ఇంతవరకూ గంటా మాటే వేదమని భావించిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి నిండుసభలో నివ్వెరపోయారు. వేపగుంటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి తన ప్రసంగంతో రాష్ట్ర మంత్రి నారాయణను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మంత్రి నారాయణను కొనియాడుతూనే నగరంలో పెండింగ్ ప్రాజెక్టుల జాప్యాన్ని, అధికారుల అనాలోచిత చర్యలను గుర్తు చేశారు. ఇలా ప్రసంగిస్తుండగా, మంత్రి గంటా ఆయన వైపు ఒకింత అసహనంగా చూశారు.
ఎంపీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. ‘చాల్లే చెప్పింది.. ఇక ఆపు...’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దీంతో ముత్తంశెట్టి అవాక్కయ్యారు. మీరు ఎంపీ పదవిని అనుభవించారు... అయినా మంత్రిగారు కాస్త ఒత్తిడితో ఉన్నట్లున్నారు...సభకు నమస్కారం అంటూ ప్రసంగం ఆపేశారు. ఆ తర్వాత మంత్రి గంటా మైకుతీసుకుని ముత్తంశెట్టిని మరోమారు చమత్కరించారు. ముత్తంశెట్టికి ఎంపీ పదవి తొలిసారి...అందుకే ఇంత ఉత్సాహం అంటూ...వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.