
చంద్రబాబుది ‘రైతు ద్రోహ దీక్ష’
సీపీఎం నేత రాఘవులు
సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు ఈ నెల 2న చేపట్టేది నవనిర్మాణ దీక్ష కాదని, అది రైతు ద్రోహ దీక్ష అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంత ప్రజా సమస్యలపై ఉండవల్లిలో ఆదివారం ఆయన ప్రజలతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, వాళ్ల నోట్లో మట్టికొట్టి రైతు ద్రోహిగా ముద్రపడిన చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేస్తారా? అంటూ దుయ్యబట్టారు.
రాజధాని అంశంతో ముడిపడిన అనేక సమస్యలకు చంద్రబాబు ఈ నెల 6 భూమి పూజలోగా స్పష్టమైన ప్రకటన చేయకుంటే విజయదశమి నాడు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలోపు ప్రజా ఉద్యమం చేపట్టి ఈ ప్రభుత్వాన్ని పాతేస్తామని రాఘవులు అల్టిమేటం ఇచ్చారు. భూమి పూజను అడ్డుకుంటామని ప్రకటించారు.
జగన్ దీక్షతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి..
రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 3, 4 తేదీల్లో చేపట్టే దీక్షతో చంద్రబాబు మొండి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు రావాలని కోరారు.