ఎన్నాళ్లీ వెనుకబాటు? | Back Word Region Grant Fund Scheme UPA 1government released | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ వెనుకబాటు?

Published Mon, Mar 2 2015 12:50 AM | Last Updated on Sat, Aug 25 2018 4:39 PM

Back Word Region Grant Fund Scheme UPA 1government released

 సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద బీఆర్‌జీఎఫ్(బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్) స్కీమ్‌ను యూపీఎ1 ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఆ స్కీమ్‌కి విజయనగరం జిల్లా ఎంపికైంది. ఈ మేరకు  జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.25కోట్ల నిధులు విడుదల చేస్తూ వస్తోంది.  వాటితో జిల్లా పరిషత్ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపడుతూ వస్తోంది. ఈ నిధులొచ్చాక జిల్లాలో వేల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి.
 
 మించిపోయిన సమయం
 2014-15కి సంబంధించి సకాలంలో వెళ్లిన జిల్లాల ప్రతిపాదనలకు గత కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలయ్యాయి. కానీ, అవి మన జిల్లాకొచ్చే సరికి  జెడ్పీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేతల మెప్పు కోసం కొత్తగా ఏర్పడే జిల్లా పరిషత్ పాలకవర్గం చేత ప్రతిపాదిద్దామని వ్యూహాత్మక జాప్యం చేశారు. అనుకున్నట్టే పాలకవర్గం కొలువు తీరాక తీర్మానం చేసి పంపించారు. కానీ, ఈలోపే జరగాల్సిన జాప్యం జరిగిపోయింది. ఆలస్యంగా వచ్చాయన్న కారణంగా జిల్లా ప్రతిపాదనలను ముందే తెలిపిన ‘సాక్షి’ఇంతలోనే కేంద్రప్రభుత్వం వైఖరి కూడా మారింది. బీఆర్‌జీఎఫ్‌కు నిధులు సమకూర్చుతున్న ప్రణాళికా సంఘాన్ని ఏకంగా రద్దు చేసింది. దాని స్థానే నీతి అయోగ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
 
 పణాళిక సంఘమే లేనప్పుడు బీఆర్‌జీఎఫ్ కింద నిధులెలా వస్తాయన్న అనుమానం అప్పుడే మొదలయ్యింది.  ఇదే విషయవై ‘సాక్షి’ దినపత్రికలో ఫిబ్రవరి 17వ తేదీన ‘‘బీఆర్‌జీ నిధులపై నీలినీడలు’’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. కథనం ప్రకారం వెల్లువెత్తుతున్న సందేహాలకు తగ్గట్టుగానే కేంద్రం  బీఆర్‌జీఎఫ్‌పై ఆసక్తి చూపలేదు. ఏకంగా ఆ స్కీమ్‌ను రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రకటించింది. దీంతో జిల్లా ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకుండా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో  వెనుకబడిన విజయనగరం జిల్లా పరిస్థితి దయనీయంగా ఉంది. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి యూపీఎ ప్రభుత్వం  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు ప్రస్తుతం అధికార బీజేపీ కూడా వంతు పాడింది. దీంతో ఈ ప్యాకేజీతోనైనా జిల్లా వెనుకబాటు తనాన్ని పారదోలేందుకు అవకాశం ఉంటుందని మేధావులు భావించారు.
 
 కొత్త రాగం..
 ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు ఏటా రూ.500కోట్లు చొప్పున వచ్చే అవకాశం ఉందని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని ఆశించారు. ఇయతే ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ విషయాన్ని పక్కన పెట్టి ప్రత్యేక నిధులంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది. ఆమేరకు ఇటీవల జిల్లాకు రూ.50కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.  ఇలా ఎన్నేళ్లు ఇస్తుందో లేదో కూడా స్పష్టంగా పేర్కొనలేదు. వెనుకబడిన జిల్లాలో భాగంగా విజయనగరం జిల్లాకు  సంవత్సరానికి  రూ.500కోట్లుచొప్పున ఐదేళ్లు వస్తాయనుకుంటే ప్రత్యేక నిధుల పేరుతో కేవలం రూ.50కోట్లతో  కేంద్రం చేతులు దులుపుకోవడాన్ని తెలుసుకుని జిల్లా ప్రజలు తట్టు కోలేకపోయారు.   ఇదే తరహాలో ఐదేళ్ల పాటు ఇచ్చినా రూ.250కోట్లు దాటవు. జిల్లా అభివృద్ధికి ఎటూ సరిపోవు. ఇప్పటికే నిధుల్లేమి, లోటు బడ్జెట్ కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ నిధులతోనైనా గట్టెక్కుతామనుకుంటే కేంద్రం ప్రత్యేక నిధుల పేరుతో సరిపెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement