
దరఖాస్తుకూ.. గ్రహచారం
విజయనగరం : ఇటీవల ఒక నిరుపేద యువకుడు విజయనగరం మున్సిపల్ అధికారులను కలిశా డు. రుణాల కోసం దరఖాస్తులు ఇవ్వాలని కోరాడు.
, విజయనగరం : ఇటీవల ఒక నిరుపేద యువకుడు విజయనగరం మున్సిపల్ అధికారులను కలిశా డు. రుణాల కోసం దరఖాస్తులు ఇవ్వాలని కోరాడు.
అయితే, స్క్రీనింగ్ కమిటీ తో ఒక మాట చెప్పించుకోండి, అప్పు డు ఇస్తామని ఉచిత సలహా ఇచ్చారు. తాము చెబితేనే దరఖాస్తులు ఇవ్వాలని కమిటీ సభ్యులు ఆదేశించారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. దీంతో ఆ యువకుడు అవాక్కయ్యాడు. దరఖాస్తుకు కూడా నేతలను సంప్రదించాలా అని నిరాశతో వెనుతిరిగాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క యువకుడిదే కాదు జిల్లా అంతటా ఇలాగే ఉంది. లబ్ధి చేకూర్చడం పక్కన పెడితే దరఖాస్తు ఇవ్వడానికి కూడా ఆంక్షలేనా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికంగా లబ్ధి చేకూర్చే పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం 101జీఓ ముసుగులో ఏర్పాటైన రాజకీయ కమిటీల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిరుపేదలకిచ్చే రుణాల విషయంలో పక్షపాత ధోరణి అవలంబిస్తున్నాయి. లబ్ధి పక్కన పెడితే అర్హులైన వారికి కనీసం దరఖాస్తులు కూడా ఇవ్వకుండా చేస్తున్నాయి. అధికార పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే అధికారులు దరఖాస్తులు ఇస్తున్నారు. దీంతో అనేక మంది దరఖాస్తుకు నోచుకోక పథకాలకు దూరమవుతున్నారు.
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,695 మంది లబ్ధిదారులకు 1,210 యూనిట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా మార్జిన్ మనీ కింద 3,532 యూనిట్లు, రాజీవ్ అభ్యుదయ యోజన కింద 540 యూనిట్లు, ఐటీడీఏ ద్వారా 2,838 యూనిట్లు, వికలాంగ సంక్షేమ శాఖ ద్వారా 49 యూనిట్లు మంజూరుకు సిద్ధంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకైతే 60 శాతం, బీసీ, వికలాంగ, మైనార్టీలకైతే 50 శాతం సబ్సిడీ అందనుంది. దీంతో నిరుపేదలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
పోనీలే ప్రభుత్వం దిగిపోయే ముందేనా ఆర్థికాభివృద్ధి పథకాలు మంజూరు చేసిందని సంతోషించారు. కానీ వారి ఆశలను అదే సర్కార్ ఏర్పాటు చేసిన రాజకీయ కమిటీలు ఆడియాశ చేస్తున్నాయి. దరఖాస్తులు ఇచ్చే దగ్గరి నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు తమ హవా చూపిస్తున్నాయి. సాధారణంగా అర్హులైన వారందరికీ అధికారులు విధిగా దరఖాస్తులు ఇవ్వాలి. వాటిని నింపిన తర్వాత ఆశావహులు తిరిగి అధికారులకు సమర్పించాలి. వాటిని 101 జీఓ కింద ఏర్పాటైన కమిటీల ద్వారా పరిశీలన చేసి, అర్హులైన వారిని లబ్ధిదారులగా ఎంపిక చేయాలి. వాటికి బ్యాంకుల ఆమోదం తీసుకోవాలి. తదనంతరం యూనిట్లు మంజూరు చేయాలి.
కానీ జిల్లాలో అందుకు భిన్నంగా జరుగుతోంది. ఎంపిక ప్రక్రియలో ప్రాథమిక దశ నుంచి కమిటీలు అడ్డదార్లు తొక్కుతున్నాయి. అర్హులైన వారికి దరఖాస్తులు ఇవ్వకుండా అడ్డు తగులుతున్నాయి. తాము చెప్పినవారికే దరఖాస్తులు అందజేయూలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు తందాన తాన పాడుతున్నారు.
ఇతరుల దరఖాస్తులు లేనప్పుడు సులువుగా తమకు అనుకూల వ్యక్తులను లబ్ధిదారులగా ఎంపిక చేసేయవచ్చన్నది అధికార పార్టీ నేతల ఎత్తుగడ. మొత్తానికి దరఖాస్తు స్థాయిలోనే అర్హులను తొలగిస్తున్నారు. దీంతో రాజకీయ అండదండలు లేనివారంతా నిరాదరణకు గురవుతున్నారు. ఇక కమిటీ సభ్యుల మిగతా అరాచకాల విషయానికొస్తే గ్రామసభలు పెట్టి, దరఖాస్తులను స్వీకరించి, పరిశీలన చేసి అక్కడికక్కడే లబ్ధిదారులను ఎంపిక చేయాలి.