ప్రొద్దుటూరు : చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన ప్రొద్దుటూరు వాసులు భారీ వర్షాల కారణంగా బద్రినాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో ఆగిపోయారు. వీరికి మూడు రోజుల పాటు సరిగా అన్నపానీయాలు కూడా లభించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పైగా వీరిని తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ పంపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా ఇంత వరకు రాలేదని యాత్రికులు వాపోయారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో ఉన్న శ్రీకాశిరెడ్డినాయన లారీ ట్రాన్స్‌పోర్టు యజమాని పోలక శివానందరెడ్డి (సున్నపుబట్టి వీధి)తోపాటు లారీ యజమానులైన అతని మిత్రులు ఉండేల మురళీమోహన్‌రెడ్డి (రామేశ్వరం), ఉండేల మునికుమార్‌రెడ్డి (రామేశ్వరం), కుడుముల గంగిరెడ్డి (మోడంపల్లి), ఆవుల నాగేశ్వరరెడ్డి (బాలాజీనగర్), దోసకాయల ప్రసాద్ (భగత్‌సింగ్ కాలనీ), శెట్టికుమార్ (బాలాజీనగర్), హనుమంతరెడ్డి (వైఎంఆర్ కాలనీ)లు చార్‌ధామ్ యాత్రకు ఈనెల 21న రాత్రి ఇన్నోవా వాహనంలో బయల్దేరి వెళ్లారు. వీరిలో శెట్టికుమార్ డ్రైవర్ కాగా హనుమంతరెడ్డి మాత్రం ట్రాన్స్‌పోర్టులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ముందుగా వారి అంచనా ప్రకారం ఈనెల 27వ తేదీ రాత్రికి ప్రొద్దుటూరుకు చేరాల్సి ఉంది.
కొండ చరియలు విరిగిపడి..
కాగా ప్రొద్దుటూరు నుంచి వెళ్లిన వీరు గత బుధవారం బద్రినాథ్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో భారీ వర్షాలు పడి కొండచరియలు విరిగి వీరి ఇన్నో వా వాహనంపై పడి అద్దం పగిలినట్లు వారు తెలిపారు. వర్షాల కారణంగా నదులు ప్రవహించడంతో రోడ్లు తెగిపో యి రాకపోకలు స్తంభించిపోయాయి. బద్రినాథ్ సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో వీరి ప్రయాణం ఆగిపోయింది. బుధవారం నుంచి శనివారం ఉదయం వరకు వీరు అక్కడే ఆగిపోయారు. విద్యుత్ సరఫరాలేకపోవడంతోపాటు అన్నపానీయాలు కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అ దుపులోకి రావడంతో శనివారం ఉద యం బద్రినాథ్‌కు వెళ్లి తిరుగు ముఖంపట్టారు. వీరి సమాచారాన్ని అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులను రక్షించేం దుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమ వద్దకు హెలికాప్టర్ పం పుతామని ప్రకటించినా ఇక్కడకు రాలేదని శివానందరెడ్డి సాక్షికి తెలిపారు. రాకపోకలు పునఃప్రారంభమైతే తిరిగి ఇంటికి రాగలమని, తమకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వారు ఫోన్‌లో వివరించారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన వీరు భారీ వర్షాల కారణం గా మధ్యలో ఇరుక్కోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ వారి పరిస్థితి ఎలా ఉందోనని సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కొన్ని మార్లు ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది.
నా భర్త సురక్షితంగా ఉన్నానని చెప్పాడు
పరిస్థితి తెలియడంతో శని వారం నా భర్తకు ఫోన్ చేశా. ఆయన సురక్షితంగా ఉన్నట్లు తెలిపాడు. త్వరగా ఇంటికి వస్తానని చెప్పాడు.
లక్ష్మి, దోసకాయల ప్రసాద్ భార్య
మిత్రులకు ఫోన్ చేశాను
భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలియడంతో నా మిత్రులందరికి ఫోన్ చేశాను. వారు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
- నాగభూషణ్ రెడ్డి, కాశినాయనట్రాన్స్‌పోర్టు క్లర్క్
బద్రీనాథా.. ఎంత కష్టమయ్యా..
Published Sun, Jun 28 2015 1:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement