
దువ్వూరు మండలం కానగూడూరులో జరిగిన బీసీల సభలో ప్రసంగిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
(ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరు నవ్వులు చూడటమే నా ధ్యేయం. పాదయాత్ర పూర్తయ్యాక బీసీగర్జన చేపట్టి అక్కడే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. ప్రతికులానికి ఏం చేస్తా మో తెలియజేస్తాం. మనం అధికారంలోకి వచ్చాక బీసీల్ని అన్నివిధాలా ఆదుకుంటాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ఏడోరోజు సోమవారం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో కాన గూడూరులో బీసీ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వారి విజ్ఞప్తులు, సలహాలు స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
పేరుకే బాబుకు బీసీలపై ప్రేమ..
బీసీల అభ్యున్నతికి మీరందరూ సలహాలు, సూచనలు ఇవ్వండి. మనందరి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు పరిపాలనకు భిన్నంగా ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా పనిచేస్తా. వైఎస్సార్ సువర్ణయుగాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చు కుంటే.. నాన్నగారి పాలనలో గొర్రెలు, మేకల చెవులకు కూపన్‌లు కట్టేవాళ్లు. ఏ గొర్రె చనిపోయినా పూర్తి ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ, బాబు హయాంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తుందా? అని అడుగుతున్నా. (లేదు లేదు అంటూ ప్రజల నుంచి సమా ధానం వినిపించింది). ఈ నాలుగేళ్లలో ఒక్క ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేకపోయారు. జీవ నోపాధి కోల్పోయిన వారి జీవితాల గురించి ప్రభుత్వం కనీస ఆలోచన కూడా చేయట్లేదు. పేరుకు మాత్రమే బాబుకు బీసీల మీద ప్రేమ. నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలిచ్చేసి బీసీల మీద ప్రేమ ఇంతే అంటున్నారు.
ఫీజు ఎంతైనా సరే.. మేము చెల్లిస్తాం
బీసీలపై ప్రేమ అంటే ఏంటో వైఎస్సార్ చూపించారు. ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే.. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదవాలని నాన్నగారు కలలుకన్నారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేశారు. కానీ, ఇప్పుడు కాలేజీ ఫీజులు లక్ష దాటితే.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ. 35వేలు మాత్రమే చెల్లిస్తోంది. అది కూడా ఏడాది తర్వాత చెల్లిస్తే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఫీజులిమ్మంటే ‘తల్లిదండ్రులు ఇళ్లు అమ్ముకుని కట్టుకుంటారులే’అని చంద్రబాబు చులకనగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. పేదరికం పోవాలంటే ప్రతి బీసీ కుటుంబంలో పిల్లలు పెద్ద చదువులు చదవాలి. ఫీజు ఎంతైనా సరే ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు నేను చదివిస్తా. అంతేకాదు, పిల్లల భోజన, వసతి సదుపాయాలకోసం అదనంగా రూ. 20 వేలు ఇస్తాం. ఇద్దరేసి పిల్లల్ని బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు అమ్మఒడి పథకం కింద రూ.15వేలు అందజేస్తాం. ఇది ఒక్కటే కాదు... ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు 45 ఏళ్లకే పింఛను ఇవ్వబోతున్నాం.
బీసీ కమిటీ... బీసీ గర్జన...
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడటమే నా లక్ష్యం. అందుకోసం మరో రెండుమూడు రోజుల్లో బీసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ ప్రతీ నియోజకవర్గంలో పర్యటించి ప్రజల నుంచి సలహాలు స్వీకరించి నివేదిక ఇస్తుంది. పాదయాత్ర పూర్తయ్యాక ఆ నివేదిక ఆధారంగా బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం. అక్కడే ప్రతి కులానికి ఏం చేయబోతున్నామో స్పష్టంగా చెప్తాం. నా మనస్సులో ఇవాళ్టికి ప్రధానంగా మూడు కార్యక్రమాలు ఉన్నాయి. పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడంతోపాటు అదనంగా మరో రూ. 20 వేలు ఇవ్వడం.. అమ్మ ఒడి పథకం, 45 ఏళ్లకే పింఛన్. ఇంకా ఏమైనా ఉంటే దారిపొడవునా సూచనలు, సలహాలు ఇవ్వండి తప్పకుండా తీసుకుంటా.
Comments
Please login to add a commentAdd a comment