
సలాం తంబీ!
జిల్లాలో ఎక్సైజ్ శాఖ తెలుగుదేశం పార్టీ నేతలకు సలాం చేస్తోంది. వారికి సంపాదనా మార్గాలను చూపుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో ఎక్సైజ్ శాఖ తెలుగుదేశం పార్టీ నేతలకు సలాం చేస్తోంది. వారికి సంపాదనా మార్గాలను చూపుతోంది. వారు సూచించిన వ్యక్తులకు బెల్టు షాపులు ఇప్పిస్తోంది. మద్యం వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి ఆ దుకాణాల్లో వాటా ఇప్పిస్తోంది. ఎంఆర్‌పీ ఉల్లంఘన, బెల్టుషాపుల నియంత్రణ వంటి ప్రధాన విధులు నిర్వహించాల్సిన ఎక్సైజ్ అధికారులే వాటిని విస్మరించి రాయబారాలు నెరపుతున్నారు. వ్యతిరేకించే సీనియర్ డీలర్లను వేధిస్తున్నారు.
సీబీఐ, సీబీసీఐడి, ఏసీబీ తరహాలో మూకుమ్మడి దాడులు చేస్తోంది. కేసులు నమోదు చేస్తూ మిగిలిన వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పెరిగిన ఈ వేధింపులు మద్యం వ్యాపారుల్లో చర్చనీయాంశమయ్యాయి..
వ్యతిరేకించిన వారిపైనే కేసులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం లెసైన్సులు పొందిన వ్యాపారుల నుంచి ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు ఎటువంటి పెట్టుబడి లేకుండా వాటాలు డిమాండ్ చేశారు. కొంతమంది వ్యాపారులు వీరి బెదిరింపులకు భయపడి అక్కడి ఎమ్మెల్యేలకు 20 నుంచి 30 శాతం వాటాలు ఇచ్చారు. కొందరు సీనియర్ డీలర్లు, ఇతర పార్టీలకు చెందిన వ్యాపారులు టీడీపీ ఎమ్మెల్యేల ప్రతిపాదనలను వ్యతిరేకించడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగి రాయబారాలు నడుపుతున్నారు.
ఎమ్మెల్యేకు వాటా ఇవ్వకపోతే తమ నుంచి ఎటువంటి సహకారం లభించదని స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులకు నచ్చ చెప్పి ఎంతోకొంత వాటాలు ఇప్పిస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. మాట వినని వ్యాపారులపై రాష్ట్ర స్థాయి స్పెషల్ టాస్క్ ఫోర్సు విభాగం దాడులకు దిగుతోంది. గుంటూరు నగరంలో 80 బార్లు, 32 మద్యం దుకాణాలు ఉంటే, అధికారుల ప్రతిపాదనలకు అంగీకరించని వారి దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. కేసులు నమోదు అవుతున్నాయి.
రోజుకో కొత్త ప్రతిపాదన ...
జిల్లాలో సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల, పెదకూరపాడు, బాపట్ల, రేపల్లె, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని మద్యం వ్యాపారుల నుంచి అక్కడి టీడీపీ ఇన్‌చార్జిలు వాటాలు పొందారనేది బహిరంగ రహస్యం. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు తాము పొందిన వాటాలను ఇతరులకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు అమ్ముకుని, ఆ వ్యక్తులకు వ్యాపార నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
రోజుకో కొత్త ప్రతిపాదన ఎమ్మెల్మేల నుంచి వస్తుండటంతో కొంత మంది మద్యం వ్యాపారులు నష్టానికైనా లెసైన్సును అమ్ముకునేందుకు సిద్ధపడుతున్నారు. గురజాల నియోజకవర్గంలో కొందరు వ్యాపారు లు లెసైన్సులను నష్టానికి అమ్ముకుని వెళ్లిపోయిన సంఘటనలు లేకపోలేదు.
బెల్టు షాపుల కేటాయింపులకు సిఫారసులు
బెల్టు షాపులను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు టీడీపీ ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులకు మద్యం వ్యాపారుల నుంచి బెల్టుషాపులు ఇప్పిస్తున్నారు. టీడీపీకి చెందిన మండల, గ్రామస్థాయి నాయకులే ఇప్పుడు జిల్లాలోని బెల్టుషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ అనుచరులకు ఆదాయ మార్గాలను చూపించే క్రమంలో ఎమ్మెల్యేలు బెల్టుషాపులు ఇప్పిస్తున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం కల్పిస్తున్నారు.
కొందరు మద్యం వ్యాపారులు తమ బంధువులు, స్నేహితులు, ఎప్పటి నుంచో తమతో వ్యాపారంలో కొనసాగుతున్న వారికి బెల్టు షాపులు కేటాయించారు. వారిని కూడా వదిలిపెట్టకుండా తాము సూచించిన టీడీపీ కార్యకర్తలకే బెల్టుషాపులు కేటాయించాలని మద్యం వ్యాపారులపై అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో 3 వేలకుపైగా బెల్టుషాపులు ఉంటే, 2 ,300 బెల్టుషాపులు టీడీపీ కార్యకర్తలు, నాయకులవే. గ్రామానికి కనీసం 5 బెల్టుషాపులకు అనుమతి ఇవ్వడమే కాకుండా టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారికే వచ్చే విధంగా ఈ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు.