
సాక్షి, చిత్తూరు : దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే రాయలసీమకు గుర్తింపు వచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఏనాడూ రాయలసీమను పట్టించుకోలేదని అన్నారు. అధికార, అభివృద్ధి వికేంద్రీకరణకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. అధికార వికేంద్రీకరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నారావారిపల్లెకు వచ్చిన జనమే నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అధికార వికేంద్రీకరణ జరిగిందని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ సూచన మేరకే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
అందుకే చంద్రబాబును ఓడించి కుప్పంకు పంపారు
నారావారిపల్లె చాలా మంచిదని, అందుకే చంద్రబాబునాయుడిని ఓడించి కుప్పానికి పంపారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఆదివారం నారావారిపల్లెలో జరిగిన ప్రజాసదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం బాగుండాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రతి కుటుంబం సీఎం జగన్‌ను దేవుడిలా భావిస్తున్నారని అన్నారు.