
‘ఉద్దేశపూర్వకంగానే టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యం’
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి వేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను నిర్వీర్యం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం కాపాడతామని, దాని వేలం ద్వారా వచ్చే డబ్బుతో రుణమాఫీ చేస్తామని చెప్పారని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటిదాకా ఎర్రచందనం ద్వారా కేవలం రూ.800కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని, 10వేల 500 టనన్నుల ఎర్రచందనం నిల్వలను ఎందుకు వేలం వేయలేదని భూమన సూటిగా ప్రశ్నించారు. స‍్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఎందుకు నీరుగార్చుతున్నారని భూమన ధ్వజమెత్తారు.
ఎర్రచందనం స్మగ్లర్లకు, టీడీపీ నేతలకు ఉన్న బంధం విడదీయరానిదని, లక్షల కోట్ల ఎర్రచందనం దోచుకుంటుంటే చంద్రబాబు చేతులు ముడుచుకుని చూస్తున్నారని అన్నారు. ప్రకృతి సంపదను దోచుకునే అధికారం మీకెక్కడిదంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి వెంటనే చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.