వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్‌ | Biswabhusan Harichandan Inaugurates APJ Abdul Kalam Statue | Sakshi
Sakshi News home page

వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు: ఏపీ గవర్నర్‌

Published Sun, Dec 22 2019 6:02 PM | Last Updated on Sun, Dec 22 2019 8:10 PM

Biswabhusan Harichandan Inaugurates APJ Abdul Kalam Statue - Sakshi

సాక్షి, కర్నూలు: మాజీ రాష్ట్రపతి, భారత ఆటమిక్ ఎనర్జీ సాధికారతకు విశేష కృషి చేసిన శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని కర్నూలు మెడికల్ కాలేజీలో ఏపీ గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డా. ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని అవిష్కరించడం.. ఎంతో సంతోషంగా ఉందని బిశ్వభూషన్‌ హరిచందన్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నాగేశ్వరరెడ్డి లాంటి ఎంతో మంది ప్రముఖ డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందారని గవర్నర్‌ తెలిపారు. మహాత్మాగాంధీజీ కూడా నిరుపేదలకు సేవలు అందించడానికి డాక్టర్ కావాలనుకున్నారని ఆయన గుర్తు చేశారు.

వైద్యులు రోగుల పాలిట దేవుళ్లు లాంటివారని దేశం, సమాజం, నిరుపేదల గురించి వారు ఆలోచించి నిస్వార్థంగా, త్యాగ నిరతితో పనిచేయాలని సూచించారు. నిరుపేదల ఆరోగ్యం కోసం డాక్టర్లు కృషి చేయాలని బిశ్వభూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజ్ అలుమ్ని విద్యార్థులు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సెంటినరీ సెలెబ్రేషన్స్ సందర్భంగా 5 రోజుల్లో రికార్డు స్థాయిలో రూ.12 లక్షల సభ్యత్వ నిధిని సేకరించి గవర్నర్‌కు అందించారు. గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌ను కర్నూలు మెడికల్ కాలేజ్ అలుమ్ని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. 

దీంతోపాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ ఎంపీ ల్యాడ్స్ పథకం కింద రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిన మూడు త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు, రూ.49 లక్షలతో తాండ్రపాడు జిల్లాపరిషత్‌ పాఠశాలలోని ఇండోర్ స్టేడియంలో నిర్మించిన ఉడన్ కోర్టును గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంభించారు. పంచలింగాలలో రూ.28 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, తోగూరు ఆర్థర్, కంగాటి శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, కేఎంసీ ప్రిన్సిపల్ డా. చంద్ర శేఖర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. రాంప్రసాద్, కేఎంసీ అలుమ్ని విద్యార్ధులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement