
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీకి వత్తాసు పలుకుతున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను విధుల నుంచి తప్పించాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు కరువయ్యాయని, ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నేతలపై దాడులు చేయడం దారుణమన్నారు. హింసా రాజకీయాల ద్వారా టీడీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బాబుతో కలిసి ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై దాడి జరిగితే కొడికత్తి దాడి అని చంద్రబాబు వెకిలిగా మాట్లాడారని విజయ్ బాబు మండిపడ్డారు. ఓట్ల గల్లంతుపై ఓ ప్రైవేటు వ్యక్తిపై కేసుపెడితే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేత పరిటాల రవి హత్య జరిగితే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని, వైఎస్ వివేకానంద హత్యపై థర్డ్ పార్టీ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
సీఎం వైఖరి చూసి ఏపీ ప్రజలంతా అసహించుకుంటున్నారని విజయ్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షంపై భౌతిక దాడులకు పాల్పడుతున్న టీడీపీ బెదిరింపుల చూసి ఎవ్వరూ బెదిరేదిలేదని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అధికార యంత్రాంగం టీడీపీకి ప్రచారం దారుణమన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment