తెలంగాణలో కమలానికి సైకిల్‌పై సవారీ తప్పేలా లేదు. చివరి నిమిషంవరకు పొత్తు వద్దంటే వద్దని వారించిన పార్టీ....
-
అరుణ్ జైట్లీకి బాధ్యతలు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కమలానికి సైకిల్‌పై సవారీ తప్పేలా లేదు. చివరి నిమిషంవరకు పొత్తు వద్దంటే వద్దని వారించిన పార్టీ రాష్ట్ర నేతలు ఎట్టకేలకు జాతీయ నాయకత్వం ఆదేశాలకు తలొగ్గాల్సిన పరిస్థితి వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలో గురువారం జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుల వ్యవహారాన్ని సుదీర్ఘంగా చర్చించిన నేతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీతో పొత్తు ఖరారు బాధ్యతను రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీకి అప్పజెప్పారు.
దీంతో ఆయన రాష్ట్ర పార్టీ నేతల్లో కొందర్ని సంప్రదించి... టీడీపీతో పొత్తుకు మానసికంగా సిద్ధం కావాలని సలహా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర నాయకత్వం పొత్తుల్లో ఏయే సీట్లు పోతాయి, ఏవేవి దక్కుతాయనే దానిపై దృష్టి సారించింది. ఈనెల 15న జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో దీనిపై స్పష్టత తీసుకురానున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ సర్దుకుపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వింటుంది. తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లపై పార్టీ ఎన్నికల కమిటీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేయగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు ప్రాథమిక సమాచార సేకరణే జరగలేదు. ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.హరిబాబు త్వరలో ఈ ప్రక్రియ చేపడతారు.
పార్టీలో పలువురి చేరిక: నల్గొండ, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ దేశ ప్రజలందరూ మోడీని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, భువనగిరి టిక్కెట్ ఆశిస్తున్న వన్నాల శ్రీరాములు, జాతీయ జల యాజమాన్య విభాగం కన్వీనర్ వెదిరే శ్రీరాం, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.