బెంగళూరు : అనంతపురము జిల్లా కొత్త చెరువు వద్ద బెంగళూరు-నాందేడ్ రైలు బోగీలో సజీవ దహనమైన వారిని బంధువులకు అప్పగించే ప్రక్రియ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో కొనసాగుతోంది. సోమవారం మరో మూడు మృత దేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. వారిలో ఎస్‌ఆర్. కృష్ణమూర్తి (70-మైసూరు), అనిరుధ్ కులకర్ణి (24-నాందేడ్), ప్రతాప్ వినయ్ (43-పాట్నా) ఉన్నారు. దీంతో మొత్తం 14 మృత దేహాలను బంధువులకు అప్పగించినట్లయింది. మరో 11 మృతదేహాలను గుర్తించినప్పటికీ, డీఎన్‌ఏ పరీక్షా ఫలితాల కోసం బంధువులు ఎదురు చూస్తున్నారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉంది.
అనుకున్నంతా అయింది...
తాము భయపడిన విధంగానే జరిగిందని మైసూరుకు చెందిన కృష్ణమూర్తి బంధువులు బోరుమన్నారు. సంగీత విమర్శకుడైన ఆయన రాయచూరులోని ఓ సంగీత పాఠశాల వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రైలులో వెళ్లారు. ఆయనకు భార్య అమృతమూర్తి (60), తల్లి అన్నపూర్ణమ్మ (90) ఉన్నారు. శుక్రవారం అల్లుడు చంద్రశేఖర్ ఆయన వెంట నగరంలోని జయనగరకు వచ్చారు. అక్కడి నుంచి కృష్ణమూర్తి ఒక్కరే ఆటోలో యశ్వంతపుర రైల్వే స్టేషన్‌కు వెళ్లారు.
పదిన్నర గంటలకు ఆయనే తనకు ఫోన్ చేసి రెలైక్కానని, ఇంకా బయల్దేరలేదని చెప్పారని చంద్రశేఖర్ తెలిపారు. మరుసటి రోజు టీవీలలో రైలులో అగ్ని ప్రమాదం జరిగిన వార్తలను చూసిన తర్వాత ఆయనకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చిందని వివరించారు. అందరూ కొత్తచెరువుకు వెళ్లామని, అక్కడి అధికారుల సలహాతో విక్టోరియా ఆస్పత్రికి తిరిగి వచ్చామని చెప్పారు.
సిబ్బంది కొరత
మృతుల గుర్తింపు కోసం ఇక్కడి మడివాళలోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగ శాలలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల కొంత జాప్యం జరుగుతోంది. శ్యాంపిల్స్ విశ్లేషణ ప్రక్రియ చాలా భారంతో కూడుకున్న పని. కేవలం ఇద్దరే ల్యాబ్ టెక్నీషియన్లు ఉండడంతో విక్టోరియా, బౌరింగ్, లేడీ కర్జన్ ఆస్పత్రుల నుంచి 15 మంది వైద్యులను ఇక్కడికి తరలించారు. రాత్రంతా వారు దీని కోసం శ్రమిస్తున్నారు. మృతులు, బంధువుల నుంచి రక్తం, కాలేయ కణజాలాన్ని సేకరించి పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. మంగళవారానికి డీఎన్‌ఏ పరీక్షలు పూర్తవుతాయని వైద్యులు తెలిపారు.
వైద్యులపై ఒత్తిడి
తమ వారి మృత దేహాలను త్వరగా అప్పగించాలని బంధువులు వివిధ మార్గాల ద్వారా వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. రాష్ర్ట, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సిఫార్సుల్లో నిమగ్నమైనప్పటికీ వైద్యులు వారికి నచ్చజెపుతున్నారు. మృతులు ధరించిన లోదుస్తులు, పాదాల ఆధారంగా బంధువులు తమ వారి మృత దేహాలను గుర్తించినప్పటికీ, శాస్త్రీయంగా అంగీకరించలేమని వైద్యులు చెబుతున్నారు.
జన్యు పోలికలను సరి చూడకుండా అప్పగిస్తే, భవిష్యత్తులో పొరబాటు జరిగిందని తేలితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వైద్యులు రాజకీయ నాయకులకు సూచిస్తున్నారు. మృతుల బంధువులకు నష్ట పరిహారం కూడా అందించాల్సి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సలహా ఇస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు మౌనం దాల్చుతున్నారు.
రైళ్ల సంఖ్యకు అనుగుణంగా పెరగని సిబ్బంది
కేంద్ర ప్రభుత్వం ఏటా రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను ప్రకటించడం ఆనవాయితీ. దీనికి అనుగుణంగా సిబ్బంది నియామకంపై శ్రద్ధ చూపడం లేదు. గత కొన్నేళ్లుగా కొత్త పోస్టులను మంజూరు చేయలేదు. బోగీల నిర్వహణకు కూడా రైల్వే శాఖ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అనేక రైళ్లు వివిధ చోట్ల బయలుదేరి గమ్య స్థానాలను చేరడానికి బెంగళూరు స్టేషన్ మీదుగా సాగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో బోగీల బాగోగులను చూసే సమయం తక్కువగా ఉంటుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏడ్చి... ఏడ్చి... కన్నీరు ఇంకి..
Published Tue, Dec 31 2013 11:25 AM | Last Updated on Sat, Apr 6 2019 8:55 PM
Advertisement
Advertisement