నాగవరంలో రెండు వర్గాల ఘర్షణ
Published Thu, Jan 2 2014 2:27 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
క్రోసూరు, న్యూస్‌లైన్ :నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసే విషయంలో మంగళవారం అర్ధరాత్రి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. సబ్‌ఇన్‌స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగవరం గ్రామ సెంటర్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు వివిధ రాజకీయ పార్టీల ఫెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరొక సామాజిక వర్గానికి చెందిన వారు అక్కడకు చేరుకుని నూతనసంవత్సరం సందర్భంగా ట్రాక్టర్‌తో, ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు వాదులాడుకోవడంతో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. ఒకరినొకరు రాళ్లు రువ్వుకుని కర్రలతో దాడులకు దిగారు.
ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన పలు దుకాణాల్లో ఫ్రిజ్‌లు, చిల్లర సరుకులను పాడుచేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను ధ్వంసం చేశారు. గాయాలైనవారిలో పఠాన్ యూసుఫ్‌ఖాన్, పఠాన్ ఇస్మాయిల్ ఖాన్, పఠాన్‌గౌస్‌ఖాన్, సయ్యద్‌సైదా, ఎస్‌డి సైదా, పఠాన్ హామద్, మరో వర్గానికి చెందినవారిలో అల్లం ప్రసాద్, అల్లం శ్రీను, అల్లం పుల్లారావు, ఆవుల రాంబాబు, పులిగొండ శివయ్య, జలపాటి బాజి తదితరులు ఉన్నారు. గాయపడిన వారిలో యూసుఫ్‌ఖాన్‌ను గుంటూరు ఆస్పత్రిలో చేర్పించారు. ఘర్షణ వాతావరణంతో గ్రామస్తుల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న సత్తెనపల్లి సీఐ శ్రీనివాసులరెడ్డి నాగవరం వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు. పీఎస్‌ఐ మోహన్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
16మందికి గాయాలు..
నాయకుల పరామర్శ
సత్తెనపల్లి: క్రోసూరు మండలం నాగవరంలో కాంగ్రెస్, సీపీఎం వర్గాల మధ్య జరిగిన దాడిలో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను బుధవారం ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని ఆయా పార్టీల నాయకులు పరామర్శించారు.
Advertisement
Advertisement