
తూర్పుగోదావరిలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా తమ అభిమాన హీరోలకు ఫ్లెక్సీలు కట్టడానికి రెండు మండలాల్లో కొందరు అభిమానులు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురయ్యారు. రెండు మండలాల్లో జరిగిన ఈ సంఘటనలో ఐదుగురు మృతిచెందగా, మరో 7 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
వివరాలిలా ఉన్నాయి.. రంగంపేట మండలం వడిశలేరులో ఇద్దరు మృతిచెందారు. మండపేట మండలం మారేడుబాకలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.