
సాక్షి, విశాఖపట్నం: ప్రజల భద్రతే ముఖ్యమని కంపెనీ కాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రులు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు. మృత దేహాలను త్వరగా తరలించి అంత్యక్రియలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరిస్థితులను అర్థం చేసుకోవాలని మంత్రులు సూచించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. (విశాఖ విషాదం: ఎల్‌జీ పాలిమర్స్ క్షమాపణ)
సున్నితమైన సమయంలో ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగవద్దన్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని ప్రజలను తప్పుదోవ పట్టించవద్దన్నారు. ఎల్‌జీ పాలిమర్స్ యాజమాన్యం పట్ల ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తుందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని మంత్రులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రులు తెలిపారు. (ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!)