
సాక్షి, విజయవాడ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బ్రాహ్మణుల దశాబ్దాల కలను సాకారం చేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే చంద్రబాబుకు సంక్షేమ సారధి వైఎస్ జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 439 జీవో అమలు చేయడం ద్వారా బ్రాహ్మణులు సంతోషిస్తున్నారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అర్చకుల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు జగనేనని ప్రశంసించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అర్చకుల కుటుంబాల్లో భయాందోళనలు తొలిగి దేవుని సేవలో నిస్వార్థంగా, సంతోషంగా పనిచేసేందుకు దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 33 యాక్ట్‌ను అర్చకుల వంశపారంపర్యం కోసం ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆచరణలో చూపి రూ. 234 కోట్లను ధూపదీప నైవేద్యానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం, 100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 439 జీవో ద్వారా బ్రాహ్మణులకు న్యాయం జరిగి, చరిత్రలో ఇదో మైలు రాయిగా నిలుస్తుందని వెల్లడించారు. సమస్యల పరిష్కారంతో హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment