నిడదవోలు.. టీడీపీలో విభేదాలు | Brother Differences In TDP In Nidadavolu About Assembly Tickets | Sakshi
Sakshi News home page

నిడదవోలు.. టీడీపీలో విభేదాలు

Published Sun, Mar 17 2019 7:55 AM | Last Updated on Sun, Mar 17 2019 7:56 AM

Brother Differences In TDP In Nidadavolu About Assembly Tickets - Sakshi

బూరుగుపల్లి శేషారావు, బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ

సాక్షి, నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నా యి. సీటు కోసం అన్నదమ్ముల మధ్య పోటీ నెలకొంది. దీంతో సీటు కేటాయింపును పార్టీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ను బూరుగుపల్లి శేషారావుకు ఇప్పించడంలో అతడి అన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారు. అయితే అనంతరం కుటుంబంలో చెలరేగిన తగాదాలు రోడ్డుకెక్కడంతో ఈసారి వేణుగోపాలకృష్ణ కూడా బరి లో నిలిచారు.

నిడదవోలు సీటును తనకే టాయించాలని వేణుగోపాలకృష్ణ పట్టుబట్టడం, సిట్టింగ్‌ స్థానాన్ని మరలా తనకే ఇవ్వాలని శేషారావు భీష్మించడం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నాలుగున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న టీడీపీ అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ తొలిసారి టికెట్‌ కోసం రోడ్డెక్కడం కలకలం రేపింది. వీరితో పాటు కుందుల సత్యనారాయణ కూడా సీటు ఆశించడంతో నియోజకవర్గంలో టీడీపీ మూడు వర్గాలుగా మారింది.

ఇటీవల అమరావతిలో జరిగిన నియోజకవర్గ సమీక్ష సమావేశంలోనూ శేషారావుకు సీటు కేటాయించవద్దని కుందుల వర్గం ప్లకార్డులు ప్రదర్శించడం వి వాదాస్పదమైంది. ఆయా వర్గాలు అమరావతిలో మకాం వేసి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పలు విద్యాసంస్థల యాజమాన్యాలను అమరావతికి తీసుకువెళ్లి వేణుగోపాలకృష్ణ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నా రు. టికెట్‌ ఎవరికి కేటాయిస్తే ఎలాంటి పరి ణామాలు ఎదురవుతాయోననే ఆలోచనలో నిడదవోలు పంచాయితీ అధిష్టానానికి పెను సవాల్‌గా మారింది.

 చివరిసారిగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే శేషారావు, వేణుగోపాలకృష్ణను సీటు ఎవరికి కావాలో తేల్చుకోమని అధిష్టానం చెప్పింది. అయితే వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు జరగకపోవడంతో విభేదాలు కొలిక్కిరాలేదు. ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్నా సీటు వ్యవహారంలో సస్పెన్షన్‌ వీడలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే శేషారావు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement