డెంగీతో బీటెక్ విద్యార్థి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే
చాపాడు : మండల పరిధిలోని నరహరిపురం గ్రామానికి చెందిన పాళెంపల్లె బాలవీరారెడ్డి కుమారుడు బీటెక్ చదువుతున్న పాళెంపల్లె విష్ణువర్ధన్‌రెడ్డి(22)అనే విద్యార్థి ఆదివారం రాత్రి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. మధ్యప్రదేశ్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న విష్ణువర్ధన్‌రెడ్డి నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. రక్తకణాలు(ప్లేట్‌లేట్స్) తగ్గిపోయాయని ప్రొద్దుటూరులో ప్రైవేటు వైద్యులు సూచించడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.
నివాళులర్పించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి:
డెంగీ జ్వరంతో మృతి చెందిన పాళెంపల్లె విష్ణువర్ధన్‌రెడ్డి భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి నివాళులర్పించారు. విష్ణు తల్లిదండ్రులను ఆయన పరామర్శించి, ఓదార్చారు. ఈయన వెంట వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, నాయకులు బిర్రు రామచంద్రయ్య, సర్పంచ్ సుబ్బరామిరెడ్డి, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, కుచ్చుపాప మాజీ సర్పంచ్ లక్షుమయ్య, నక్కలదిన్నె మురళీశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.