'అందుకే లోకేశ్‌ను పప్పు అంటున్నారేమో'
విజయవాడ: మంత్రి నారా లోకేశ్ మంచివాడని, అందుకే ఆయనను పప్పు అంటున్నారేమోనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. పప్పు అనేది బూతు కాదని ఆయన అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉందని, ఖజానా నిండగానే నిరుద్యోగభృతి చెల్లిస్తామని చెప్పారు. కృష్ణా నది కబ్జా విషయాన్ని టీవీలో చూశానని.. కబ్జాకు పాల్పడిన వారిలో తమ పార్టీ నేతలు ఎవరున్నా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
నిరుగుద్యోగులకు వెంటనే భృతి చెల్లించాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ శనివారం బహిరంగ లేఖ రాశారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత లేఖతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. త్వరలో యూత్ పాలసీని ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంప్లాయిమెంట్ బోర్డు ద్వారా నిరుద్యోగుల జాబితా ప్రకటిస్తామన్నారు. నిరుద్యోగ భృతికి రూ. 500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.