'పేరు చెడగొట్టుకుంటున్న పురందేశ్వరి'
విజయవాడ: బీజేపీ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరి, కావురి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆదివారం విజయవాడలో నిప్పులు చెరిగారు. ఆ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా వీరంతా ఓ కూటమిగా ఏర్పాడ్డారని విమర్శించారు. వీరికి బీజేపీ పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫునే పోటీ చేస్తామని వీరంతా ప్రమాణం చేస్తారా ? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కుమార్తెగా దగ్గుబాటి పురందేశ్వరికి పేరుందని... ఉన్న పేరును ఆమె చెడగొట్టుకుంటున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు సోనియాగాంధీని పొగిడిన నోటీతోనే నేడు ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇస్తోందన్నారు. ఏపీకి ఏమైనా అధికంగా నిధులు ఇస్తున్నారా ? అని వారిని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.