సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకూ ఉమ్మడిగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) అమ్ములపొదిలోకి మరో అత్యాధునిక పరికరం వచ్చి చేరింది. వివిధ రకాలైన ఆడియోలను విశ్లేషించి, కచ్చితమైన నివేదికలివ్వడానికి ఉపకరించే సి-డార్ పరికరాన్ని ల్యాబ్ అధికారులు ఇటీవలే కొనుగోలు చేశారు. దక్షిణ భారత్‌లో మరే ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లోనూ ఇలాంటి పరికరం అందుబాటులో లేదు. ఇటీవలికాలంలో ఆడియోతో కూడిన వాయిస్ అనాలసిస్‌తో ముడిపడిన కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సభల్లోనూ, ఆన్‌లైన్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతోపాటు ఫోన్ల ద్వారా, నేరుగా బెదిరింపులే గాక.. కొన్ని రకాలైన భారీ కుంభకోణాల కేసుల దర్యాప్తులోనూ అనుమానిత వ్యక్తి వాయిస్ రికార్డులు, శాంపిల్స్‌ను పక్కాగా విశ్లేషించడం కీలకంగా మారింది. ఆడియో సంబంధిత కేసుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికే నిందితుడ్ని న్యాయస్థానంలో దోషిగా నిరూపించడానికి కీలకమైంది. ఇప్పటివరకు ఈ తరహా పరీక్షల కోసం పోలీసు విభాగంతోపాటు ఇతర ఏజెన్సీలు చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ లేబొరేటరీపై ఎక్కువగా ఆధారపడేవి. ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ సైతం కొన్ని కేసుల్ని పరిష్కరించినా ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండేవి కాదు. ఆడియో విశ్లేషణతో ముడిపడి ఉన్న కేసులకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏపీఎఫ్‌ఎస్‌ఎల్ డెరైక్టర్ శారద అవధానం ఉన్నతాధికారుల అనుమతితో లండన్‌కు చెందిన ప్రముఖ కంపెనీ నుంచి సి-డార్ పరికరాన్ని కొనుగోలు చేశారు. ఓ ఆడియోను విశ్లేషించాల్సి వచ్చినప్పుడు దాంతోపాటు అది ఎవరిదిగా పోలీసులు అనుమానిస్తున్నారో వారి నమూనాలనూ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు సేకరిస్తారు. ఈ రెంటినీ సి-డార్‌లో విశ్లేషించడం ద్వారా మరింత కచ్చితమైన నివేదికలిచ్చే అవకాశమేర్పడింది. ఈ పరికరాన్ని ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా వినియోగిస్తున్న ఫోరెన్సిక్ సిబ్బందికి మరింత సమర్థంగా విశ్లేషించడానికి వీలుగా తగిన మెరుగైన శిక్షణను విదేశాల్లో ఇప్పిం చేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్, పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఫోరెన్సిక్ అమ్ములపొదిలో సి-డార్
Published Thu, Oct 30 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM
Advertisement
Advertisement