రాజధానిపై బాబు నాటకం
- ‘రియల్’కు దన్ను
- చార్జీలు పెంచకుండా పాలన సాగించాలి
- రుణమాఫీ సంగతేంటి?
- స్పీకర్ తీరు గర్హనీయం
- వైఎస్సార్ సీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట : తన స్వార్థం కోసం... అనుచరుల రియల్‌ఎస్టేట్ వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై స్పష్టత ఇవ్వడం లేదని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు సామినేని ఉదయభాను విమర్శించారు. గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలల పాలనలోనే రాజధానిపై మంత్రులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. దీంతో 13 జిల్లాల ప్రజలు అయోమయంలో పడుతున్నారని చెప్పారు.
అధికారంలో ఉండి కూడా రాజధానిపై నిర్ణయం తీసుకోలేని ముఖ్యమంత్రి మౌనంగా ఉండటానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే చార్జీలు పెంచకుండా పరిపాలన సాగించాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను వివరిస్తుంటే వారికి మైక్‌లు ఇవ్వడం లేదన్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడుతూ ప్రజలను వంచన చేస్తున్నరని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను నేటికీ నెరవేర్చకుండా మౌనంగా ఉండిపోయారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా మాఫీకి సంబంధించిన స్పష్టమైన హామీ ఇవ్వకుండా రైతులను మరింత గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు.
మంచి పాలన అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు మండిపడుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్‌చేస్తుండటం అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరుగలేదన్నారు. మున్సిపల్ చైర్మన్ తన్నీరునాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు పటాన్ ఫిరోజ్‌ఖాన్, న్యాయవాదులు పసుపులేటి శ్రీనివాసరావు, సామినేని రాము, ఆరోవార్డు కౌన్సెలర్ ఇంటూరి చిన్న తదితరులు పాల్గొన్నారు.