
సాక్షి, పట్నంబజారు(గుంటూరు): అక్రమంగా ఓ స్థలంలోని సామాన్లు ఖాళీ చేయించిన విషయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటు పలువురిపై కేసు నమోదైంది. గుంటూరు అరండల్‌పేట ఎస్‌హెచ్‌ఓ బత్తుల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం విద్యానగర్‌లో నివాసం ఉండే అద్దంకి శ్రీకృష్ణ అమరావతి రోడ్డు, డొంకరోడ్డు ప్రాంతాల్లో బాలాజీ టెంట్ హౌస్ డెకరేకర్స్ అండ్ లైటింగ్ వ్యాపారం గత కొంతకాలంగా చేస్తున్నాడు.
వ్యాపారం నిమిత్తం ఏఈఎల్సీ చర్చి కాంపౌండ్‌లోని మహిమ గార్డెన్స్‌లో ఉన్న కర్లపూడి బాబూప్రకాష్ స్వాధీనంలోని నాలుగున్నర ఎకరాల స్థలాన్ని 2008లో అగ్రిమెంట్ రాసుకున్నారు. రూ.6.50 లక్షలు ఇచ్చి ఆ స్థలంలో కల్యాణమండపం సామాన్లు పెట్టుకునేందుకు మూడు షెడ్డులు నిర్మించారు. ఆ స్థలంపై ఆయనకు 2021 వరకు హక్కు ఉంది. 2015లో కర్లపూడి బాబూప్రకాష్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గోడౌన్‌ను ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురిచేశారు.
ఈక్రమంలో శ్రీకృష్ణ కోర్టును ఆశ్రయించగా వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన శ్రీకృష్ణ కుమారుడు శివసాయి,మరో పది మంది వర్కర్లు ఉండగా, పొక్లెయిన్‌తో పది మందితో కలిసి వచ్చి షెడ్డులను పగులగొట్టి సుమారు రూ.40 లక్షల విలువ చేసే సామగ్రి ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆనందబాబు, కర్లపూడి బాబూప్రకాష్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment