హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి | ccording to trial In testimony, Hassan demand to ysrcp | Sakshi
Sakshi News home page

హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి

Published Thu, May 29 2014 1:39 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి - Sakshi

హసన్ వాంగ్మూలంపై విచారణ జరిపించాలి

నల్లధనంపై విచారణ బాబుతోనే ప్రారంభించాలి  ఎన్‌డీఏ సర్కారుకు వైఎస్సార్ సీపీ డిమాండ్
 
హైదరాబాద్:రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని విదేశాలకు తరలించానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ గతంలో సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంపై ఎన్‌డ్‌ఏ ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం సరిహద్దులు దాటి వెళ్లిన నల్లధనాన్ని వెనక్కి తెప్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం పట్ల తమ పార్టీ హర్షం వ్యక్తంచేస్తోందని చెప్పారు. ఈ నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. 1995 - 2005 మధ్య కాలంలో ఓ మాజీ ముఖ్యమంత్రికి చెందిన నల్ల డబ్బును తాను విదేశాలకు చేరవేశానని హసన్ అలీ సీబీఐకి చెప్పినట్లు వార్తలు వచ్చాయని.. ఆ మాజీ ముఖ్యమంత్రి జీవించే ఉన్నారని కూడా అతడు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని ఆమె గుర్తుచేశారు. హసన్‌అలీ సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఇచ్చినట్టు చెపుతున్న ఈ వాంగ్మూలం మీద ఎన్‌డీఏ ప్రభుత్వం తొలి విచారణ చేపట్టాలన్నారు. హసన్ అలీ చెప్పిన దానిని బట్టి.. సదరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని తెలిసిపోతోందని, అందువల్ల విచారణ జరిపిస్తే అన్ని విషయాలూ వెల్లడవుతాయని పద్మ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్‌డీఏలో భాగస్వామి కనుక బీజేపీ ప్రభుత్వం విచారణ జరుపకుండా ఉపేక్షిస్తుందా? హసన్ అలీ చెప్పిన విషయాలను మరుగు పరుస్తోందా? అనే  అంశాలను బట్టి వారి నిష్పాక్షికత బయటపడుతుందని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం తన నిష్పాక్షికతను రుజువు చేసుకోవడానికి చంద్రబాబుపై విచారణ జరిపించి తీరాలని ఆమె డిమాండ్ చేశారు.

 రూ. 12 వేల కోట్లు ఎలా వచ్చాయి?

ఇప్పుడు మహానాడులో నీతి సూత్రాలు వల్లిస్తున్న చంద్రబాబు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున రూ. 3,000 కోట్లు, లోక్‌సభ నియోజకవర్గాల్లో దాదాపు అంతకు మూడు రెట్లు- అంటే రూ. 9000 కోట్లు ఖర్చు చేశారని వాసిరెడ్డి పద్మ చెప్పారు. ఇన్ని నిధులు బాబుకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు తన కొడుక్కి నేర్పిన సంస్కారం ఇదేనా!

టీడీపీ అట్టహాసంగా జరుపుకుంటున్న మహానాడులో మరణించిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, మృతి చెందిన వ్యక్తిని తూలనాడరాదన్న కనీస విచక్షణ కూడా కోల్పోయి మాట్లాడారని ఆమె విమర్శించారు. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ విదేశీ చదువు కోసం ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలను ముంచి ఉండొచ్చు కానీ వైఎస్ ఏనాడూ అలా ఆలోచించలేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్ తన కుమారుడు జగన్ ఏ విధంగా అయితే ఎంబీఏ చదువుకున్నారో అదే విధంగా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని అందరికీ ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారని ఆమె గుర్తుచేశారు. జగన్ తన ప్రసంగాల్లో చంద్రబాబు గారూ.. అనే సంబోధించారని, సంస్కారం తప్పి మాట్లాడలేదని, అది వైఎస్ తన కుమారుడికి నేర్పిన సభ్యత సంస్కారాలని ఆమె చెప్పారు. అదే మహానాడులో లోకేష్ వైఎస్, జగన్ గురించి మాట్లాడిన తీరు చూస్తే అది ఏ తరహా సభ్యతో, ఏం సంస్కారమో.. ఇదేనా చంద్రబాబు తన కుమారునికి నేర్పింది అని ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement