- నేడు కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఇవ్వనున్న సీఎం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటు ప్రతిపాదనలు, తనిఖీ జాబితా (చెక్ లిస్ట్) వివరాల నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డాకు అందజేయనున్నట్లు తెలిసింది. సీఎం ఢిల్లీ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ఉండటం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.
కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఎయిమ్స్‌పై ప్రతిపాదనలు, తనిఖీ జాబితాను పంపడంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సమర్పించనున్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లా బీబీనగర్ వివరాలతోపాటు నిబంధనల ప్రకారం మరో మూడు ప్రాంతాల్లో ఉన్న మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపైనా చెక్‌లిస్ట్ ఇస్తారని తెలుస్తోంది.
దీంతోపాటు తాము ప్రకటించినట్లుగా ఎయిమ్స్ నిర్మాణానికి బీబీనగర్ అనువైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వం నివేదించనున్నట్లు సమాచారం. దాన్ని ఖరారు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిసింది. అక్కడ 150 ఎకరాలు గుర్తించినట్లు, ఇంకా అవసరమైన 50 ఎకరాలు కూడా సేకరిస్తున్నామని పేర్కొననున్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించి కూడా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్‌హెచ్‌ఎం కింద గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న కార్యక్రమాలను కొనసాగించేందుకు అవసరమైన నిధులను సీఎం కోరనున్నట్లు సమాచారం. ఇక 13 ఆర్థిక సంఘం నిధులతో రాష్ట్రంలో 55 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కేంద్రానికి లేఖ కూడా రాశారు. సోలార్ విద్యుత్‌కు, పీహెచ్‌సీల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధులతో కలిపి రూ. 50.59 కోట్లు విడుదల చేయాలని కోరనున్నట్లు సమాచారం.