
జేపీకి సర్వే బంపర్ ఆఫర్
మూసాపేట: లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కాంగ్రెస్‌లోకి వచ్చి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ అడిగితే.. అమ్మగారికి చెప్పి తాను ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి సర్వే పేర్కొన్నారు. రాజకీయాల్లో, అసెంబ్లీలో ఆయనకు మంచి పేరు ఉందని, జేపీ కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. సర్వే ఇలా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న జేపీ చిరునవ్వు చిందించారు.
మూసాపేటలో నూతనంగా నిర్మించిన వాటర్ రిజర్వాయర్‌ను మంగళవారం కేంద్ర మంత్రి సర్వే, కూకట్‌పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ పాల్గొని ప్రారంభించారు. అనంతరం సర్వే మాట్లాడుతూ.. వచ్చేసారీ మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తానన్నారు. దేశంలో ఇప్పటివరకు మంచి పాలన అందించిన ముఖ్యమంత్రుల్లో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికే ప్రథమ స్థానం దక్కిందన్నారు.
ఆయన ప్రజల కోసం 108, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే జేపీ మాట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేని పాలనతో రాష్ట్రం గందరగోళంగా మారిందన్నారు. కొత్తగా నిర్మించిన రిజర్వాయర్‌తో వచ్చే సంవత్సరంలో మంచినీటి సమస్య ఉండదన్నారు. కార్యక్రమంలో ఉపకమిషనర్ గంగాధర్, ఈఈ రమేశ్ గుప్తా, మూసాపేట, కూకట్‌పల్లి కార్పొరేటర్లు పి.బాబురావు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.