సాక్షి, హైదరాబాద్: కృష్ణానది నీటి పంపకాలకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనున్నందున, దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు. ట్రిబ్యునల్ తీర్పుపై రైతుల్లో నెలకొన్న భ యాందోళనలపై సోమవారమిక్కడ సచివాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ ముఖ్యకార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, అరవిందరెడ్డి, అంతరాష్ర్ట జల విభాగం ఇంజనీర్లు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తీర్పు అమల్లోకి రాకుండా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. న్యాయపోరాటంలో ఇప్పటి వరకు ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే... వాటిని సవరించుకోవాలని కోరారు. ఇదే విషయంపై మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.