‘బలవంతమైన సర్పము చలిచీమలచేత చిక్కి..’ అన్న మాటలు వారి గుండెల నిండా విశ్వాసాన్ని నింపాయి. చేయీచేయీ కలిపి.. ‘సమైక్య దండు’గా ఐక్యమై హస్తినపై సమరానికి కదిలారు. అటు శ్రీకాకుళం నుంచి.. ఇటు రాజమహేంద్రి వరకూ వేల గొంతుల్ని ఒక్కటి చేసి.. సమైక్యాంధ్ర పరిరక్షణే తమ ధ్యేయమంటూ నినదించారు. ఢిల్లీ గద్దెపై ఏలుబడి సాగిస్తూ.. తెలుగుతల్లిని ముక్కచెక్కలు చేసేందుకు పరమ తెంపరితనంతో యత్నిస్తున్న కాంగ్రెస్ ‘పెద్దల’కు తెలుగోడి సత్తాను రుచి చూపుతామంటూ ప్రతినబూనిన సమైక్యవాదులు ప్రత్యేక రైళ్లలో కురుక్షేత్రం దిశగా సాగారు. తమ అభిప్రాయాన్ని మన్నించకుంటే మహాసంగ్రామం తప్పదంటూ హెచ్చరించారు.
సాక్షి, రాజమండ్రి :‘సోనియమ్మా.. తెలుగువారిని ముక్కలుచెక్కలు చేసే అధికారం నీకెవరిచ్చారో ఢిల్లీలోనే తేల్చుకుందాంరూ. అని నినదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హస్తిన దిశగా కదిలాయి. రాజ్యాంగ నిబంధనలను తోసిరాజని.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును అప్రజాస్వామికంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద సమైక్య ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు శ్రీకాకుళం నుంచి ఇటు రాజమండ్రి వరకూ నాలుగు జిల్లాల కార్యకర్తలు, నేతలు ప్రత్యేక రైలులో శనివారం ఢిల్లీకి బయలుదేరారు. ఈ రైలు రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది. మొక్కవోని దీక్షతో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సమైక్య పోరాటంలో పాలుపంచుకునేందుకు రైలులో వెళ్తున్న సమరయోధులకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అదే సమయంలో మాజీ మంత్రి, సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజమండ్రి రైల్వే స్టేషన్ అంతటా ‘జై సమైక్యాంధ్ర, జై జగన్’ నినాదాలతో మార్మోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ‘మేం ఇక్కడ ఎన్ని ఆందోళనలు చేసినా కేంద్రం పట్టించుకోవడంలేదు. అసలు రాష్ట్రానికి సంబంధం లేనివారు దీనిని ముక్కలు చేస్తున్నారు. తెలంగాణలో ఎవరికో అధికారం కట్టబెట్టాలని, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చుకోవాలని ఒక రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటోంది యూపీఏ ప్రభుత్వం’ అని ఈ సందర్భంగా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు మాగోడు పట్టకపోతే మేమే ఢిల్లీ వచ్చి మావాణి ఎంత బలమైనదో వినిపిస్తాం. మీ దాష్టీకాన్ని అడ్డుకుంటాం’ అని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గారపాటి ఆనంద్, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, జిల్లా రాజమండ్రి అర్బన్ అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్, కో ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఇతర నేతలు ఆదిరెడ్డి వాసు, ఆర్.వి.వి.సత్యనారాయణ చౌదరి, రాయవరం మాజీ ఎంపీపీ సిరిపురపు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తనయుడు వాసు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. 22 బోగీల్లోని 2,200 మందికి వీటిని పంపిణీ చేసినట్టు ఆదిరెడ్డి అప్పారావు హైదరాబాద్ నుంచి ఫోన్‌లో తెలిపారు.
కాకినాడ నుంచి ఏపీఎన్జీవోలు పయనం
కాకినాడ సిటీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించతలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీఎన్జీవోలు శనివారం మధ్యాహ్నం కాకినాడ నుంచి ప్రత్యేక రైలులో బయల్దేరి వెళ్లారు. కాకినాడ నుంచి 18 బోగీలతో ఈ రైలు బయలుదేరింది. సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కార్యదర్శి పితాని త్రినాధ్‌ల నాయకత్వంలో వివిధ శాఖల ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులు, విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌లో ఆశీర్వాదం మాట్లాడుతూ స్లీపర్ బోగీలకు సొమ్ము చెల్లించినప్పటికీ జనరల్ బోగీలు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చలో ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాము వెనకడుగు వేసేది లేదని ఢిల్లీలో సమైక్యాంధ్ర సత్తా చాటుతామని చెప్పారు.
సమైక్య దండుగా..సంగ్రామానికి..
Published Sun, Feb 16 2014 1:05 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement