నమ్మిన మాదిగలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మోసం చేస్తుంటే, తెలంగాణలో వారి ఉనికే లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ ధ్వజమెత్తారు
విజయవాడ : నమ్మిన మాదిగలను ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మోసం చేస్తుంటే, తెలంగాణలో వారి ఉనికే లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాదిగల విశ్వరూపాన్ని చంద్రబాబుకు తెలియచేసే రీతిలో వచ్చే నెల 14వ తేదీన విజయవాడలో విశ్వరూప మహాసభను లక్షలాది మందితో నిర్వహించనున్నామన్నారు.
ఇక కేసీఆర్ తెలంగాణలో మాదిగల ఉనికి లేకుండా చేయాలనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితులకే అవకాశం ఇస్తామని చెప్పిన ఆయన తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ కపట బుద్ధిని ప్రదర్శించారన్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్యను అవమానకర రీతిలో క్యాబినెట్ నుంచి తొలగించారన్నారు. రెండు రోజుల్లో వరంగల్‌లో అత్యవసర సమావేశం నిర్వహించి కేసీఆర్ నిర్ణయంపైన, మాదిగలను కాపాడుకునేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.