ఆత్మీయంగా గవర్నర్ తేనీటి విందు
కేసీఆర్, చంద్రబాబు, ఇరు రాష్ట్రాల మంత్రులు హాజరు
►సాదర స్వాగతం పలికిన గవర్నర్ దంపతులు
►రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం
►ఇరు రాష్ట్రాల మధ్య ప్రస్తుతానికి ఏ సమస్యలూ లేవు: నరసింహన్
►ఏవైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుంటామని వెల్లడి
►అరగంట సేపు కేసీఆర్, చంద్రబాబు, రోశయ్య, జానా ముచ్చట్లు
► వైజాగ్‌లో పరిస్థితిపై స్పందించని ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతానికి ఇరు (తెలంగాణ, ఏపీ) రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. ఉంటే కూర్చుని మాట్లాడుకుంటాం. ఇద్దరు ముఖ్యమంత్రులు రాకపోతే రాలేదంటారు. రాలేదని పత్రికల్లో రాసేస్తారు. ఈసారి ఆ అవకాశం ఇవ్వొద్దనే ఇద్దరు సీఎంలను పిలిచా..’’అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వ్యాఖ్యానించారు. వైజాగ్‌లో పరిస్థితి ఏమీ కాలేదని, అంతా చక్కబడుతుందని గవర్నర్ పేర్కొన్నారు. గురువారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అతిథులందరికీ గవర్నర్ దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. అందరి దగ్గరికీ వెళ్లి పేరు పేరునా పలకరించారు.
ఇద్దరు సీఎంల సరదా ముచ్చట్లు
తేనీటి విందుకు వచ్చిన కేసీఆర్, చంద్ర బాబులతో పాటు మాజీ గవర్నర్ రోశయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి నలుగురూ ఒకే చోట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడం కనిపించింది. మధ్య మధ్య పలువురు ప్రముఖులు వారిని కలసి వెళ్లారు. సుమారు అరగంటకుపైగా వారు కలసి ముచ్చటించడం గమనార్హం. ఏపీ ప్రత్యేక హోదా అంశం, దానికోసం వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఉద్యమం గురించి ఏదైనా చర్చ జరిగిందా అని సీఎల్పీ నేత జానారెడ్డిని వాకబు చేయగా.. ‘అలాంటి విషయాలు ఇలాంటి చోట్ల చర్చిస్తారా..? అన్నీ సాధారణ సంభాషణలే..’ అని చెప్పారు. రోశయ్య, చంద్రబాబు సైతం కొద్ది సేపు ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ కనిపించారు. తేనీటి విందులో తెలంగాణ, ఏపీ శాసనమండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, ఈటల, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న రాష్ట్ర బీజేపీ, టీటీడీపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఎల్.రమణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, విద్యావేత్త చుక్కా రామయ్య, సీఎస్ ఎస్‌పీ సింగ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు... గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఎక్కా యాదగిరిరావు, బీవీఆర్ మోహన్‌రెడ్డి, అబ్దుల్ వాహిద్‌లు కూడా హాజరయ్యారు.
‘హోదా’ఉద్యమంపై స్పందించని ఏపీ సీఎం
తేనీటి విందుకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు కొంత ముభావంగానే కనిపించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్‌తో కలసి రాజ్‌భవన్‌లోనికి వెళ్లే ముందు ఆయన కొద్దిసేపు విలేకరుల దగ్గర ఆగారు. తేనీటి విందుకు తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి హాజరయ్యారుకానీ.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హాజరుకాలేదు కదా అని విలేకరులు ప్రస్తావించగా చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో గురువారం జరిగిన ఆందోళన, వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై బైఠాయించిన విషయంపై ప్రశ్నించినా... చంద్రబాబు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. రన్‌వేపై బైఠాయింపు గురించి మరోసారి ప్రశ్నించగా.. ‘ఇలాంటివి మామూలే కదా’అని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.