ఎవరు.. ఇంకెవరు? | Chandrababu Cheated The BC People | Sakshi
Sakshi News home page

ఎవరు.. ఇంకెవరు?

Published Sun, Feb 3 2019 3:34 AM | Last Updated on Sun, Feb 3 2019 11:29 AM

Chandrababu Cheated The BC People - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చేయూతనందించి అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడుగడుగునా అవమానిస్తూ అణగదొక్కుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు మాయ మాటలతో మభ్యపుచ్చి ఇప్పుడు ఎన్నికలు ముంచుకు రావడంతో బీసీలే తమ దేవుళ్లంటూ కొంగ జపం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో బీసీలకు ఎన్టీఆర్‌ రాజకీయంగా ప్రాధాన్యం కల్పించినా దొడ్డిదారిన టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు మాత్రం వారిని ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారనేది పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. చంద్రబాబు గత తొమ్మిదిన్నరేళ్ల పాలనను చూసినా, ఇప్పుడు అధికారంలో ఉండగా జరుగుతున్న పరిణామాలను గమనించినా బీసీలను ఆయన నయవంచనకు గురి చేశారనేది స్పష్టమవుతుంది. 

1 హైకోర్టు జడ్జిలుగా పనిచేసేందుకు బీసీలు పనికిరారంటూ ఒక ముఖ్యమంత్రి కొలీజియానికి లేఖ రాశారని జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ ఆరోపించారు.. ఆ ముఖ్యమంత్రి ఎవరు?
2 తన సమకాలికుడైన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తున్న సీనియర్‌ బీసీ నేతను సంబంధిత శాఖ వ్యవహారాల్లో పూర్తిగా దూరం పెట్టిన సీఎం ఎవరు?
3 దేవదాయ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీసీ వర్గానికి చెందిన మంత్రిని అమరావతిలో వెంకన్న ఆలయం శంకుస్థాపనకు పిలవవద్దని చెప్పిన సీఎం ఎవరు?
4 తనకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను వేలెత్తి చూపించి బెదిరిస్తూ సెక్రటేరియట్‌లో కాలుపెట్టనివ్వబోనంటూ ఆగ్రహోదగ్రుడైన సీఎం ఎవరు? 
5 తమను ఎస్సీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విశాఖలో ఆందోళన చేసిన మత్స్యకారులను భయపెడుతూ తమాషాలు చేస్తున్నారా, మీ సంగతి చూస్తా.. అని హెచ్చరించిన సీఎం ఎవరు?
6 చేపల వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది, గల్లంతైన జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎవరు?
7 అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన సీఎం ఎవరు?

వైఎస్సార్‌ వెలిగించిన చదువుల దీపం..
కనీస చదువులు కూడా పూర్తి చేయకుండానే డ్రాపౌట్లుగా మిగిలిపోతున్న నిరుపేద బీసీ విద్యార్థులను హైస్కూలు గడప దాటించి వృత్తి విద్యా కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించిన బ్రహ్మాస్త్రం వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఇంట్లో చదువుల దీపం వెలిగితేనే ఆ కుటుంబంలో వెలుగులు వెదజల్లుతాయనేది వాస్తవం. దీన్ని గ్రహించినందువల్లే దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తెచ్చారు. పూరి గుడిసెలో తల దాచుకునే పేద కుటుంబం కూడా ఫీజుల పథకం వల్లే తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడగలిగింది. గ్రామీణ పేద విద్యార్థులకు సైతం ట్రిపుల్‌ ఐటీల్లో చదివే భాగ్యం దక్కింది. అలాంటి అద్భుత పథకాన్ని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రీయింబర్స్‌ బకాయిలు విడుదల చేయకుండా దెబ్బ తీసి నీరుగార్చారు.

నీరుగార్చేసిన నిర్వాకం బాబుదే..
పేద వర్గాలకు చెందిన పలువురు ఉన్నత ఉద్యోగాలు, గౌరవనీయమైన వృత్తుల్లో స్థిరపడేలా తీర్చిదిద్దిన ఘనత వైఎస్సార్‌ తెచ్చిన ఫీజుల పథకానిదే. పేద కుటుంబాల జీవన విధానంలో సానుకూల మార్పులతోపాటు సమాజంలో మన్ననలు పొందే స్థితికి వైఎస్సార్‌ తీసుకురాగలిగారు. ఈ తరహా ఆలోచనలను సీఎం చంద్రబాబు ఏమాత్రం చేయలేకపోగా నిరుపేద విద్యార్థులకు వరం లాంటి ఫీజుల పథకాన్ని నీరుగార్చేశారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ ర్యాంకుల ప్రాతిపదికను తెచ్చి సాంకేతిక, ఉన్నత చదువుల వైపు బీసీ విద్యార్థులు కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారని ఆయా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ‘2014 నుంచి ఇప్పటివరకు ఏటా ఫీజు రీయింబర్స్‌ బకాయిలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పూర్తి ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ కళాశాలలు యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా వేలాది మంది బీసీ, ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. హాస్టల్‌ మెస్‌ ఛార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచాలని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిమాండ్‌ చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా ఆలకించలేదు’ అని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు రాము పేర్కొన్నారు. 

బకాయిలు రూ.500 కోట్లు
వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజుల పథకాన్ని వంద శాతం అమలు చేయాలని ఆయన మృతి చెందిన తర్వాత ధర్నా చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక మాత్రం నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఆధార్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వేల మంది విద్యార్థులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

గీత కార్మికులకు కల్లే దిక్కంటున్న బాబు: ధర్మాన
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద కుటుంబాలకు చెందినవారు ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతుంటే సమాజంలో కచ్చితంగా ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారి జీవన విధానంలో అన్నివిధాలా మార్పు ఉంటుంది. ఈ తరహా మార్పును ఆశించే వైఎస్‌  రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలను తెచ్చారు. చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. తాటి చెట్టు ఎక్కేవాడు తాటిచెట్టు ఎక్కుతూనే ఉండాలి. కల్లు గీతపైనే ఆధారపడి జీవించాలి. పోగులు నేసేవాడు పోగులు నేస్తుండాలి. డోలు, సన్నాయి, క్షురక  వృత్తిదారులు ఆ పనులకే పరిమితం కావాలి. ఎదుగుబొదుగూ లేకా మగ్గిపోతుండాలి. ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు విదిలించడం తప్ప బీసీలకు చంద్రబాబు చేసింది ఏముంది?’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ తరపున రాజ్యసభకు పంపిన వారిలో ఎవరెవరు ఉన్నారో, ఇతర పదవుల నియామకాలను పరిశీలిస్తే బీసీల పట్ల చంద్రబాబు డొల్లతనం బట్టబయలవుతుందన్నారు. 

ఎన్నికల జపమే తప్ప... 
ఎన్నికల ముంగిట బీసీల జపం చేస్తున్న సీఎం చంద్రబాబు తన పాలనలో వారిని పట్టించుకోకపోగా తీవ్ర అవమానాలకు గురి చేశారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో బీసీలకిచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కదాన్ని పరిపూర్ణంగా అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. బీసీలను మోసగించేందుకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు 120కిపైగా హామీలను ప్రకటించి అనంతరం వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ కుటుంబాలకు ఐదేళ్లుగా ఎలాంటి న్యాయం జరగలేదు.  మైనింగ్‌పై బీసీలకు హక్కులు కల్పిస్తామని చెప్పి ఇసుక, ఇటుకను కూడా టీడీపీ నేతల చేతుల్లోనే పెట్టారు. కుమ్మరులను కనీసం చెరువుల్లో మట్టిని కూడా తవ్వుకోనివ్వకుండా అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కింది. 

బీసీలకు జగన్‌ హామీతో ఉలిక్కిపడ్డ బాబు
బీసీలకిచ్చిన హామీలు అమలు చేయపోగా వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతుండటం గమనార్హం. పాదయాత్రలో పేదల కష్టాలను చూసి చలించిన వైఎస్‌ జగన్‌ బీసీ అధ్యయన వేదిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక రాగానే బీసీ గర్జన నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు హడావుడిగా జయహో బీసీ కార్యక్రమానికి తెర తీసినట్లు పేర్కొంటున్నారు. బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని, అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రకటించగా... జయహో బీసీ సదస్సులో చంద్రబాబు వాటినే ప్రకటించడంపై బీసీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటుబిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లో అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ఆదరణ–2 పేరుతో ఆర్భాటం..
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇన్నేళ్ల పాటు ఆదరణ పథకం గురించి పట్టించుకోకుండా కొద్ది నెలల క్రితమే ఆదరణ–2 పేరుతో రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఉప్పర్లు, వడ్డెరలు, కమ్మరులకు కంటితుడుపుగా కొద్ది పనిముట్లు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ పథకానికి 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 2 లక్షల మందికే పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం. 

మత్స్యకారుల డీజిల్‌ సబ్సిడీకి ఎగనామం
టీడీపీ సర్కారు మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. వారు వేటాడిన చేపలకు మార్కెటింగ్‌ సౌకర్యం, కనీసం నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరేజీ సదుపాయం కూడా కల్పించలేదు. వేటకు వెళ్లి గల్లంతైన జాలర్ల కుటుంబాలకు ఏళ్లు గడిచినా పరిహారమివ్వలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే 80 మందికిపైగా మత్స్యకారులు గల్లంతు కాగా ఇప్పటివరకూ పరిహారం అందలేదు. రాష్ట్రంలో తీరం ప్రాంతం విస్తారంగా ఉన్నా గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్లి చిక్కుకుపోయి పాకిస్థాన్‌ జైళ్లలో మగ్గాల్సిన దుస్థితిని కల్పించారు. 

నేతన్నలకు వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏది?
చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికుల రుణాలన్నింటినీ మాఫీ చేసి ఉచిత విద్యుత్‌ ఇస్తానని చెప్పిన బాబు నాలుగున్నరేళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. చేనేతలకు ఇస్తున్న సబ్సిడీని రూ.600 నుంచి వెయ్యికి పెంచుతామని చెప్పి పట్టించుకోలేదు. ఆప్కో రిబేటు కింద చేనేతలకు చెల్లించాల్సిన సబ్సిడీ సొమ్మును ఇవ్వకుండా వారిని అప్పుల పాలు చేశారు. బీసీ వర్గాలకు చెందిన 11 ఫెడరేషన్లకు అరకొర నిధులిచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో రుణాలు అందక అల్లాడే దుస్థితి నెలకొంది. కాపు కార్పొరేషన్‌ తరహాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా బీసీలకు వ్యక్తిగత రుణాలు సులభంగా మంజూరు చేయాలని కోరుతున్నా ఆలకించడం లేదు. ఈ ఫెడరేషన్లను బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో అనుసంధానం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆ వర్గం నేతలు వాపోతున్నారు. న్యాయస్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన జడ్జిలు నియమితులు కాకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కొలిజీయంకు నివేదిక పంపిన చరిత్ర చంద్రబాబుదని రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య వెల్లడించడాన్ని బట్టి బీసీల పట్ల బాబుకు ఏమాత్రం ప్రేమ ఉందో బోధపడుతోంది. 

కులాలకిచ్చిన హామీలు గాలికి.. 
రజకులు, గాండ్లను ఎస్సీలుగా మారుస్తామని, సగర్లను బీసీ–డీ నుంచి ఏలోకి, పూసల బీసీ–డి నుంచి ఏలోకి, ఆరెకటికలను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని, కురుబ–కురువలను బీసీ–డి నుంచి ఎస్టీలుగా మారుస్తామని, గవరలను బీసీ–డి నుంచి బీసీ–ఏగా, పద్మశాలీలను బీసీ–బీ నుంచి బీసీ–ఏలోకి, నాగ వంశస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, మజ్జులను బీసీ–డీలోకి, విశాఖ కాపులను తూర్పు కాపులుగా గుర్తిస్తామని పలు కులాలకిచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. మరోసారి అధికారమిస్తే ఇవన్నీ చేస్తామని కొత్తగా హామీ ఇవ్వడం పట్ల సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. 

బీసీలకు కనీస గుర్తింపు లేదు...
రాష్ట్రంలో బీసీలు 52 శాతంతో 139 కులాల్లో 2.5 కోట్ల మందికిపైగా ఉన్నప్పటికీ వారికి కనీస ప్రాధాన్యం దక్కడం లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే వారి నైజాన్ని గుర్తించామన్నారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదనేందుకు ఎంబీసీ కార్పొరేషన్‌ ఒక ఉదాహరణ అని జోగి రమేష్‌ పేర్కొన్నారు. 32 కులాలతో ఎంబీసీ కార్పొరేషన్‌ అని ప్రకటించి ఇంతవరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. 

పేదల అవసరాలపై జగన్‌కు స్పష్టమైన అవగాహన..
పేదల విషయంలో ఎంత దయార్ధ్ర హృదయుడిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి మెలిగారో అంతకన్నా మిన్నగా వైఎస్‌ జగన్‌ ఉంటారనేది తమ సంపూర్ణ విశ్వాసమని వైఎస్సార్‌ సీపీ బీసీ నాయకులు జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘పేదలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు అందరితో నీరాజనాలు అందుకున్నాయి. వాటిని మెరుగ్గా తీర్చిదిద్దడంతోపాటు ప్రజామోద పథకాల రూపకల్పనకు జగన్‌ శ్రీకారం చుట్టారు. పేదల ప్రతి సమస్యను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. వాటన్నింటిపైనా అధ్యయనం చేయాలని కమిటీని నియమించి అన్ని ప్రాంతాలకు పంపారు. నివేదిక రూపొందించి సమీక్షించారు. పేదల అవసరాలపై ఆయన స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రజాశీర్వాదంతో అధికారంలోకి రాగానే వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తారు.  తండ్రికి మించిన తనయుడని ప్రజల చేత జగన్‌ అనిపించుకుంటారు’ అని వారు చెప్పారు.

మిగిలిన మంత్రులూ ఉత్సవ విగ్రహాలే
మంత్రివర్గం, పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి కూడాచంద్రబాబు చేతిలో అవమానాలు తప్పలేదు. సొంత జిల్లాలో యనమల మాట చెల్లుబాటు కాకుండా చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓగా యనమల తాను చెప్పిన వారిని నియమించుకోలేని పరిస్థితి ఉందంటే ఆయనకు ప్రభుత్వంలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉన్న కళా వెంకట్రావు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మరో బీసీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నా అధికారాలన్నీ చంద్రబాబు, ఆయన తనయుడి చేతుల్లోనే ఉన్నాయి. బీసీ మంత్రి పితాని సత్యనారాయణ తన సొంత జిల్లాలోనే పని చేయించుకునే పరిస్థితి లేదు. బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో  చాలామందిది ఇదే  పరిస్థితి. కృష్ణా జిల్లాలోని 17 మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లలో 14 చోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడాన్ని బట్టి బీసీలకు లెక్కలేనన్ని పదవులిచ్చామని చెప్పుకుంటున్న ప్రకటనలో వాస్తవం ఎంత ఉందో తేటతెల్లమవుతోంది. వైఎస్‌ హయాంలో బీసీలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, కేపీ సారథి వంటి నేతలు ప్రధాన శాఖలు నిర్వహించి కీలకంగా వ్యవహరించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

బీసీ డిక్లరేషన్‌ గాలికి..
తాము అధికారంలోకి వస్తే బీసీల తలరాతలు మార్చేస్తామంటూ 2012లో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌ను గద్దెనెక్కాక చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఈ డిక్లరేషన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ తరువాత ఆ సంగతే గాలికి వదిలేశారు. నాలుగున్నరేళ్లుగా దీన్ని పట్టించుకోకుండా తీరిగ్గా ఇప్పుడు జయహో బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్‌కు చట్టబద్ధత తెస్తామంటూ మరోసారి హామీ గుప్పించడం గమనార్హం. అధికారంలో ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా మరోసారి తమకు అవకాశం కల్పిస్తే అమలు చేస్తామంటూ మాయమాటలు చెప్పడం ఆయనకే చెల్లిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రూ.పది వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్‌ పెడతామని ఘనంగా ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోగా కేటాయింపులను సైతం ఖర్చు చేసిన పాపాన పోలేదు. బీసీ డిక్లరేషన్‌ ప్రకారం దామాషా పద్ధతిలో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని చెప్పిన మాటను తుంగలో తొక్కి కనీసం అందులో సగం స్థానాలను కూడా ఇవ్వలేదు. 

వైఎస్‌ హయాంలోనే 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం... 
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయించడంతోపాటు 2008 ఆగస్టు 29వ తేదీన అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఉంటే రాజ్యాధికారం వారికి చేరువవుతుందని అప్పట్లోనే చెప్పారు. ఇక రజక, వడ్డెర, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని జాతీయ ఎస్టీ కమిషన్‌కు నివేదించాలని వైఎస్‌ మంత్రి వర్గం అప్పట్లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఒక కులాన్ని ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి మార్చే అధికారం రాష్ట్రానికి లేనందున కేంద్రం పరిధిలోనే చేయాలని నిర్ణయించారు. ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, బొందిలి, ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణేతర), అరకలిస్, సురభి నాటకాళ్లవాళ్లు, నీలి రాజన్నల, రాజన్నలు, బారె, బార్య, మరార్, తంబోలి, మాలి కులాలను బీసీల జాబితాలో చేర్చేందుకు బీసీ కమిషన్‌ చేసిన సిఫార్సులకు వైఎస్సార్‌ ప్రభుత్వం అప్పట్లోనే ఆమోదం తెలిపింది. 

రెవెన్యూ మంత్రికి తెలియకుండా భూ కేటాయింపులు!
రాజకీయాల్లో చంద్రబాబు సమకాలీకుడు, పార్టీలో  సీనియర్‌ నేత, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికారాలకు చంద్రబాబు కోత వేశారు. రెవెన్యూ శాఖలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ  అధికారాలను ఆయనకు కాకుండా తన ఆధీనంలోని జీఏడీకి అప్పగించారు. భూముల  కేటాయింపులను కూడా ఆ శాఖను పర్యవేక్షించే కేఈతో సంబంధం లేకుండా అప్పగించేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు తీసుకున్నా కేఈకి తెలియకుండా తనకు సన్నిహితుడైన మంత్రి నారాయణతో ఆ పని చక్కబెట్టుకున్నారు. భూములు కేటాయించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూమంత్రికి స్థానం లేకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబుదే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement