సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ‘సాక్షి’ మీడియాపై అక్కసు వెళ్లగక్కారు. డేటా చోరీ అంశంపై అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సాక్షి ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సాక్షి ప్రతినిధిపై సీఎం మండిపడ్డారు. అయితే మరోసారి ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించిన సాక్షి ప్రతినిధిని ...ఒకసారి చెబితే వినాలంటూ సీఎం భయపట్టే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ మీడియా సమావేశాన్ని చంద్రబాబు పార్టీ ప్రెస్‌మీట్‌గా పేర్కొన్నారు. అందుకు ప్రతిగా సాక్షి ప్రతినిధి... మీరు పిలిస్తేనే మీడియా సమావేశానికి వచ్చామని తెలిపారు. అసలు మిమ్మల్ని ప్రభుత్వ సమావేశాలకు కూడా రానివ్వనంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబుతో పాటు మంత్రులు కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు కూడా రెచ్చిపోయారు. చేయి చూపిస్తూ కుర్చోవాలని బెదిరించారు. గతంలో కూడా చాలాసార్లు సాక్షి మీడియాపై చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అవాకులు, చవాకులు పేలిన విషయం విదితమే.
కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?
కాగా ఇదే సమావేశంలో డేటా చోరీ అంశంపై చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి దిగారు. కేంద్రంతో పాటు, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుందంటూ విమర్శలు గుప్పించారు. ‘ మా సమాచారం కొట్టేసి మా మీదే కేసులు పెడతారా?. మా రాష్ట్రంలో డేటా సేకరిస్తే మీకేమి సంబంధం. ప్రజల సమాచారం దుర్వినియోగం జరిగిందంటూ నాపై బురదజల్లి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఏదైనా అయితే మాకు ఉండాలి కానీ. నా మీద అంత ప్రేమ ఎందుకో. ఈ వ్యవహారంతో అసలు కేసీఆర్‌కు ఏం సంబంధం. మీకు అధికారం ఉందని అహంకారమా?. మా సమాచారాన్నే మీరు దొంగలించి..మమ్మల్నే బెదిరిస్తున్నారు. కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? డోంట్ మైన్.. కేంద్రం దాడులకు భయపడేది లేదు. అదేమని ప్రశ్నిస్తే ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తూ టీడీపీ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment