
కుమార్తెకు అందిన నోటీసు చూపుతున్న మహబూబ్‌బీ
డ్వాక్రా రుణాలు పూర్తీగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుని హోదాలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారిక గద్దెనెక్కిన తర్వాత రుణమాఫీ కాదు.. పెట్టుబడి నిధి ఒక్కొక్క సభ్యురాలికి మూడు విడతల్లో రూ.10వేలు చెల్లిస్తానని మాట మార్చారు. సీఎం మాట తప్పడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు అప్పుల పాలయ్యారు. ఐదేళ్ల పాలన పూర్తి కావస్తున్నా ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి కింద జమ చేస్తానన్న రూ.10 వేలు కూడా జమ కాకపోగా కోర్టులో కేసులు వేసి మహిళలను కోర్టు బోను ఎక్కేలా చేశారు.
సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో చంద్రబాబు హామీ ఇచ్చేనాటికి (2014 మార్చి నాటికి) 33,254 డ్వాక్రా సంఘాలున్నాయి. అందులో 3.21లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని ఆశించారు. కాగా 2015 జూలై ఒక్కో సభ్యురాలికి రూ.3వేలు తొలివిడతగా కేటాయించారు. 2016 అక్టోబర్‌లో రెండో విడతగా మరో రూ.3వేలు కేటాయించారు. ఈ మొత్తాన్ని కూడా సభ్యులు డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా బ్యాంకర్లు అనేక చోట్ల అడ్డగించారు. ఈక్రమంలో 2018 మార్చిలో రూ.2వేలు, అక్టోబర్‌లో రూ.2వేలు పసువు కుంకుమ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు విడతల్లో ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు కేటాయించి మమ అన్పించారు.
కుదేలైన డ్వాక్రా వ్యవస్థ...
డ్వాక్రా సంఘాలు వ్యవస్థ బ్యాంకర్లుతో సత్‌సంబంధాలు కొనసాగుతూ లావాదేవీలు సక్రమంగా ఉండేవి. ఈక్రమంలో అక్కచెల్లెమ్మలు ఎవ్వరూ బ్యాంకర్లకు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆమేరకు అత్యధిక సంఘాలు రుణాలు రికవరీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాయి. దాంతో డీఫాల్టర్లుగా అనేక సంఘాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీతో డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. బ్యాంకర్లు గ్రూపులకు కేటాయించిన రుణాలు వడ్డీతో సహా రికవరీ చేసుకున్న తర్వాత ప్రభుత్వం గ్రూపులకు వడ్డీ కేటాయిస్తే ఆ మొత్తం తిరిగి ఆయా గ్రూపుల్లో జమచేసే వారు. ఇలా వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉంది. దాదాపు రూ.176 కోట్లు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ రాయితీ జమ చేయాల్సి ఉంది. మరోమారు డ్వాక్రా సంఘాలకు అగ్రస్థానం కల్పించనున్నట్లు శుక్రవారం కడప గడపలో సీఎం నేతృత్వంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు.
డబ్బు కట్టినా కోర్టునుంచి నోటీసులా..!
ప్రొద్దుటూరు పట్టణంలోని 32వ వార్డులో నివాసం ఉంటున్నారు. వాసవి స్వయం సహాయక సంఘం సభ్యులు 2012 డిసెంబర్‌లో రూ.4లక్షలు కార్పొరేషన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. 2013 జనవరి 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా బ్యాంకుకు రుణం చెల్లిస్తున్నారు. పుస్తకాల్లో ఉన్న రికార్డు ప్రకారం షరిఫున్నీసా రూ.40వేలు రుణం తీసుకుని రూ.28,000 అసలు చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. మొత్తం రూ.12 వేలు కట్టాలని ఉంది. సరితాదేవి రూ.30 వేలు రుణం తీసుకున్నారు. రూ.25,500 అసలు, రూ.5000 పొదుపు పోను రూ.500 అదనంగా చెల్లించింది. షకీలాబేగం రూ.30 వేలు రుణం తీసుకోగా రూ.23,500 అసలు, రూ.3,700 పొదుపు పోను రూ.2,750 చెల్లించాలి. ప్రభావతి రూ.40 వేలు రుణం తీసుకోని పూర్తిగా చెల్లించింది. 5,300 పొదుపు కూడా ఎస్‌ఎల్ ఎఫ్‌లో ఉంది. రామలక్ష్మి రూ.40 వేలు రుణం తీసుకుంది. ఇందులో రూ.22,700 అసలు, 3000 పొదుపు పోను రూ.14,300 చెల్లించాలి. మాబూచాన్ రూ.30 వేలు రుణం తీసుకొని అంతా చెల్లించింది మరో రూ.5,350 పొదుపు ఖాతాలో ఉంది. షమీమ్‌బాను రూ.40 వేలు రుణం తీసుకొని పూర్తిగా చెల్లించింది. రూ.5,320 పొదుపు ఉంది. హయాతూన్‌బీ రూ.30 వేలు రుణం తీసుకొని చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. ఎస్.ఫరీనా, పి.ఫాతిమా కూడా కొంత డబ్బు చెల్లించాలి. ఈ విధంగా రూ.4 లక్షలకు గాను దాదాపు రూ.80 వేల లోపు బాకీ పడ్డారు. ఐదేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఈ గ్రూప్‌నకు కేవలం రూ.60 వేలు పెట్టుబడి నిధిగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కార్పొరేషన్ బ్యాంకు అధికారులు ఈ గ్రూప్ రూ.1,02,977 బాకీ ఉందని కోర్టులో దావా వేసి నోటీసులు పంపారు. వీరితోపాటు ఇదే వార్డులోని శ్రీకృష్ణా స్వయం సహాయక సంఘలోని సుబ్బరత్నమ్మ, శ్రీలతతో పాటు సంఘ సభ్యులకు రూ.1,47,552 డబ్బు కట్టాలంటూ నోటీసులు పంపారు. ఈ సమస్య ఆ రెండు డ్వాక్రా గ్రూపులదే కాదు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని భావించిన సభ్యులందరీ పరిస్థితి అదే.
చాలా దారుణం
వాసవీ స్వయం సహాయక సంఘం గ్రూప్‌లో తన భార్య çషమీమ్‌భాను, కుమార్తె మాబుచాన్ ఉన్నారు. తన భార్య రూ.40 వేలు, తన కుమార్తె రూ.30 వేలు రుణం తీసుకుంది. ఈ డబ్బును 2016 జనవరి 31 నాటికి పూర్తిగా కట్టేశాం. ఇక వీరి పొదుపు డబ్బు, చంద్రబాబు రుణమాఫీ పేరుతో ఇచ్చిన మూలధనం డబ్బు బ్యాంకు అధికారులు వడ్డీ కింద ఎలా జమ వేసుకుంటారు. పావలా వడ్డీలు, స్త్రీనిధి తదితర డబ్బులు ఎవరి ఖాతాలో జమ చేశారు. డబ్బు కట్టిన మా కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ బ్యాంకు అధికారులు నోటీసులు ఎలా ఇస్తారు. మాకు న్యాయం చేయాలి. మహిళలను కోర్టు బోను ఎక్కించడానికేనా డ్వాక్రా రుణమాణఫీ చేసింది. ఇది చాలా దారుణం– నూర్ అహమద్
Comments
Please login to add a commentAdd a comment