
'అధికారం కోసం ఆరాటం-జగన్‌పై పోరాటం'
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మాదిరిగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభధ్రరావు ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మాదిరిగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభధ్రరావు ఎద్దేవా చేశారు. 'అధికారం కోసం ఆరాటం, జగన్‌పై పోరాటం- ఇది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అసలు కారణమని అన్నారు. జగన్ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణ పూర్తి అయిందని తెలియగానే భయంతో బస్సుయాత్ర వాయిదా వేసుకొని ఆయన ఢిల్లీకి బయలుదేరారని ఆరోపించారు.
జగన్‌కు బెయిల్ రాకుండా చేయడానికే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి సహ అన్ని పార్టీల నేతలను ఆయన కలిశారని అన్నారు. పైకి మాత్రం రాష్ట్రంలో పరిస్థితులను వివరించేందుకు అని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వస్తే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని బాబు భయపడుతున్నారని అన్నారు. ఇరుప్రాంతాల నాయకులతో వెళ్లడం వెనుక రాజీ ప్రయత్నం ఏంటి, తెలంగాణ నేతలతో సీమాంధ్ర నాయకులు తెలంగాణకు కట్టుబడి ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
పిల్ల పార్టీ సృష్టికర్త చంద్రబాబే అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు తుంగలో తొక్కి కాంగ్రెస్కు టీడీపీని పిల్ల పార్టీ చేశారని దుయ్యబట్టారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను చంద్రబాబు కలవడం వెనుక కారణాలు ఏంటని దాడి వీరభధ్రరావు ప్రశ్నించారు. రాష్ట్రపతితో ఏం చెప్పారో రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.