
కాంగ్రెస్ డైరెక్షన్‌లో బాబు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీతో నాలుగున్నరేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు నెరుపుతున్న చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లోనూ కొనసాగించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
రాజ్యసభ ఎన్నికల్లో బట్టబయలైన కుమ్మక్కు: గడికోట
జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో నాలుగున్నరేళ్లుగా కుమ్మక్కు రాజకీయాలు నెరుపుతున్న చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లోనూ కొనసాగించారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా కాంగ్రెస్ హైకమాండ్ డెరైక్షన్‌లో భాగంగానే ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ ఎమ్మెల్యేలందర్నీ ఏకతాటిపైకి తె చ్చి ఓట్లేయించుకున్న బాబు.. విభజన విషయంలో రెండు కళ్ల సిద్ధాంతమని ఎందుకంటున్నారని ప్రశ్నించారు.
పదవి విషయంలో ఉమ్మడి విధానం, ప్రజాసమస్యలపై ద్వంద్వ వైఖరా? అని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పెంచడానికి ప్రయత్నిస్తున్న జగన్‌ను విమర్శించే అర్హత బాబుకు లేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మా పార్టీకి తగిన సంఖ్యాబలం లేనందున రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టబోమని ముందే ప్రకటించాం. ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్‌లో పాల్గొనరని చెప్పాం. చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిపితే మూడు సీట్లు రావని కాంగ్రెస్, రెండు సీట్లు కూడా రావని టీడీపీలు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చి ఎన్నికలు ముందు జరిపేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయి. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై వారి డెరైక్షన్‌లోనే పనిచేస్తూ విభజన విషయంలో ఆ పార్టీ మాదిరిగానే రెండు విధానాలు వినిపిస్తున్నారు. కేంద్రంలో అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌సీపీని స్పీకర్ మీరాకుమార్ తొలిసారి ఆహ్వానించారు. అయితే రేపు ఉదయం సమావేశమనగా, సాయంత్రం లేఖ పంపారు. వెళ్లడానికి తగిన సమయం లేకే వారికి లేఖ పంపించాం. ఆల్‌పార్టీ మీటింగ్ విషయంలో తమను తప్పుబడుతున్న చంద్రబాబు... రాష్ట్రంలో బీఏసీ సమావేశాలకు ఎందుకు హాజరుకాలేదు? అసెంబ్లీలో కూర్చుండి కూడా ఇరుప్రాంత నేతల చేత డ్రామాలు ఆడించిన వ్యక్తి... నీతి, నిజాయితీల గురించి మాట్లాడటం సిగ్గుచేటు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ పార్టీకి హోల్‌సేల్‌గా అమ్మితే, చంద్రబాబు టీడీపీని విడతల వారీగా రిటైల్‌గా అమ్ముకుంటున్నారు. నాలుగున్నర ఏళ్లుగా ప్రతీ అంశంలో కూడా కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుంటున్నారు.