సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులపై దాదాపు స్పష్టత వచ్చింది. జిల్లాలోని మెజారిటీ సీట్లలో సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల్లో ప్రస్తుతమున్న అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డికే సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పాణ్యం, నందికొట్కూరు సీట్ల విషయం మాత్రం ఇంకా తేలలేదు. పాణ్యంలో ఇన్‌చార్జ్ ఏరాసు ప్రతాప్‌రెడ్డి పనితీరు బాగోలేకపోవడం.. నందికొట్కూరు ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డికి, గతంలో పోటీ చేసిన లబ్బి వెంకటస్వామికి మధ్య వైరుధ్యాల కారణంగా ఈ రెండు సీట్లను తేల్చలేదని తెలుస్తోంది.
నంద్యాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డికి ఇవ్వడాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఏవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే, మంత్రి ఫరూక్ మాత్రం బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలిపినట్టు సమాచారం. ప్రాథమికంగా నంద్యాల సీటు బ్రహ్మనందరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధిలోని కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆలూరుకు కోట్ల సుజాతమ్మ, ఆదోని బుట్టారేణుక, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం తిక్కారెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబుతో పాటు నంద్యాల పార్లమెంటు పరిధిలోని డోన్‌కు కేఈ ప్రతాప్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యే సీట్లతో పాటు నంద్యాల ఎంపీ సీటును టీడీపీ ఖరారు చేయాల్సి ఉంది.
రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని...
కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉండనున్నారు. నంద్యాల ఎంపీ సీటు విషయంలో మాత్రం ఇంకా తేలలేదు. మొదట్లో మాండ్ర శివానందరెడ్డి పేరు వినిపించింది. అయితే, ఈ సీటు తమకే కావాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి పట్టుబట్టడంతో చంద్రబాబు కొత్త కొర్రీలను వేసినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చు కోసం రూ.60 కోట్లు సమకూర్చుకోవాలని, సదరు మొత్తం డిపాజిట్‌ను తమకు చూపాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసీ రూ. 60 కోట్లు అడగడం ఏమిటని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది.
తాము అంత మొత్తం సమకూర్చుకోలేమనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొర్రీలు వేశారని ఆక్రోశం వెలిబుచ్చుతోంది. ఎంపీ సీటు ఇస్తామని చెబుతూనే ఎగ్గొట్టేందుకు ఈ కొత్త విధానాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. ఎవరినీ అడగకుండా తమను మాత్రమే డబ్బు గురించి అడగటం ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు అవసరమైన మొత్తం తన వద్ద లేదని నంద్యాల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి నేరుగా చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. ఎన్నికల ఖర్చును పార్టీనే భరించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ విధంగా ఖర్చును భరించలేమన్న వారికి సీటు కేటాయిస్తున్నట్టు చెప్పి.. తమను మాత్రం ఎందుకు రూ.60 కోట్లు అడిగారని ఎస్పీవై రెడ్డి వర్గం వాపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment