
మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు, తదితరులు
ఆంధ్రప్రదేశ్‌ను ఇక మద్యం వరద ముంచెత్తనుంది. రాష్ట్రంలో మద్యానికి ‘లోటు’ అనేది లేకుండా పుష్కలంగా ప్రవహింపజేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం
* ఆంధ్రప్రదేశ్‌లో అదనంగా 44 లక్షల లీటర్ల మద్యం ఉత్పత్తికి ఆదేశం
* ఉన్న డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యం పెంపు.. కొత్త డిస్ట్టిలరీల ఏర్పాటు
* బీరు ఉత్పత్తి పెంపుకూ ఆదేశాలు.. బీరు ధరలు పెంచాలని నిర్ణయం
* బెల్టు షాపుల స్థానంలో మద్యం దుకాణాలకు అనుబంధ దుకాణాలు
* ఏపీలోకి వచ్చే సరుకులపై చెక్‌పోస్టుల వద్ద 12% ప్రవేశ పన్ను వడ్డన
* స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఫీజు నాలుగు నుంచి ఐదు శాతానికి పెంపు
* ఆర్థిక, ఆదాయ వనరుల శాఖల అధికారులతో సమీక్షలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను ఇక మద్యం వరద ముంచెత్తనుంది. రాష్ట్రంలో మద్యానికి ‘లోటు’ అనేది లేకుండా పుష్కలంగా ప్రవహింపజేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసుత్తం రాష్ట్రంలో 44 లక్షల లీటర్ల మద్యం కొరత ఉందని.. దీన్ని భర్తీ చేసేందుకు మద్యం ఉత్పత్తిని భారీగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. అందుకోసం.. ప్రస్తుతమున్న మద్యం డిస్టలరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కొత్తగా డిస్టలరీల ఏర్పాటుకు అనుమతించాలనీ నిర్ణయించింది. ఇం దుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గ సమావేశానికి పంపించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
బీర్లు కూడా వినియోగానికి ఉత్పత్తికి మధ్య ప్రతి మూడు నెలలకు పది లక్షల లీటర్ల కొరత ఉందని.. దీన్ని కూడా అధిగమించడానికి ఉత్పత్తిని కూడా పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపాల్సింగా నిర్దేశించారు. మద్యం ప్రియులకు మద్యాన్ని మరింత చేరువ చేసేం దుకు బెల్టు షాపుల స్థానంలో ఊరూరా మద్యం దుకాణాలకు అనుబంధ దుకాణాల ఏర్పాటును అధికారికంగానే అనుమతించాలనీ నిర్ణయిం చారు. రాష్ట్రం విడిపోయాక రెండు త్రైమాసికాల్లో వచ్చిన ఆదాయ వివరాలపై సీఎం మంగళవారం సచివాలయంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక, ఆదాయ వనరుల శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మద్యం, బీరు ఉత్పత్తిని పెంచేందుకు అనుబంధ దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలను చంద్రబాబు జారీచేశారు. బీర్ల ధరలను పెంచే ప్రతిపాదనలను కూడా ఫైలు రూపంలో పంపించాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు.
సరకులపై ఇక ప్రవేశ పన్నుల వసూలు..
రాష్ట్రంలోకి సరఫరా చేసే సరుకులపై ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టుల వద్ద ప్రవేశ పన్ను వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సిమెంట్, స్టీల్ వంటి సరుకులు ఏపీలో రవాణా అయితే సీఎస్‌టీ మాత్రమే చెల్లిస్తున్నారని, ఏపీలో ఉత్పత్తి అయ్యే సరుకులు విక్రయం సమయంలో 14.5 శాతం వ్యాట్ విధిస్తున్నామని అధికారులు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి సరుకులపై చెక్‌పోస్టుల వద్ద 12 శాతం వరకు ప్రవేశ పన్ను విధించాలని నిర్ణయించారు.
రిజిస్ట్రేషన్ల ఫీజు 5 శాతానికి పెంపు..
పొరుగు రాష్ట్రాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఫీజు ఐదు శాతం ఉన్నందున రాష్ట్రంలో కూడా ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం నుంచి ఐదు శాతానికి పెంచాలని నిర్ణయించారు. అలాగే భూ కానుకలు, సెటిల్‌మెంట్ డీడ్లపై ఫీజును రెండు శాతానికి పెంచాలని నిర్ణయించారు.
చెక్‌పోస్టుల్లో తనిఖీకి త్వరలో ఆర్డినెన్స్..
చెక్ పోస్టుల్లో పన్నుల లీకేజీని అరికట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు మహారాష్ట్రలో అనుసరిస్తున్న ఎకనమిక్ ఇంటిలిజెన్స్ యూనిట్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై 30వ తేదీన జరిగే మంత్రివర్గంలో ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని నిర్ణయించారు.
వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్..
రాష్ట్రంలో తిరిగే వాహనాలనూ తనిఖీ చేయడానికి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రవాణా అధికారులను సీఎం ఆదేశించారు.
వాహనాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయకపోవడం పట్ల రవాణా శాఖ అధికారులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు.
‘అధికారిక’ బెల్ట్ షాపులు పెట్టొద్దు!
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్
మద్యం దుకాణాల సామర్థ్యం పెంపు పేరుతో రాష్ట్రంలో అధికారిక బెల్టు షాపులు తెరిచే ప్రతి పాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాల ని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. హర్యానా రాష్ట్రం మోడల్ పేరుతో ఇప్పుడున్న ప్రతి దుకాణానికీ అనుబంధంగా మరో మూడు దుకాణాలను మం జూరు చేయాలనే కొత్తమాటను చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తేవడం శోచనీయమని ఆమె అన్నారు. మంగళవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మద్యం బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేస్తానని చంద్రబాబు ప్రతి సభలోనూ నొక్కి చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖజానా నింపుకొనేం దుకు మద్యం షాపుల సామర్థ్యం పెంపు పేరు తో అధికారికంగా బెల్ట్ షాపులను నెలకొల్పడానికి సంకల్పిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రం లో ప్రస్తుతం 4,600 మద్యం షాపులు ఉన్నాయని, ఒక్కొక్కదానికి అదనంగా మూడు షాపులు అనుమతినివ్వడం అంటే ఆ సంఖ్య ను 13,800కు పెంచడమేనని పద్మ అన్నారు. కొత్తగా డిస్టిలరీలను స్థాపించడంతో పాటుగా గ్రామాల వరకూ మద్యాన్ని తీసుకెళ్లడం వంటి చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద న్నారు. 1100 మాత్రమే ఉన్న బెల్ట్ షాపులను తొలి సంతకంతో రద్దు చేశామని చెప్పి ఆ సం ఖ్యను 13 రెట్లకు పెంచడం ఏ మాత్రం సరైన విధానం కాదని ఆమె దుయ్యబట్టారు.