
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి శాసనసభను తప్పుదోవ పట్టించారు. బుధవారం అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని తాము కోరలేదన్నారు. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సిఫార్సుల మేరకు కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని ప్రకటించారు. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత ఏడాది సెప్టెంబరు 7న అర్ధరాత్రి రాష్ట్రానికి ప్రత్యేక సాయం ప్రకటిస్తూ నిర్వహించిన విలేకరుల సమావేశంలోగానీ, ఆ మరుసటి రోజు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలోగానీ అలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తున్నామని స్పష్టం చేశారు. మే 26న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి డాక్టర్ అమర్జీత్ సింగ్ రాసిన లేఖలోనూ ఇదే అంశాన్ని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. 2014లో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పునర్విభజన చట్టం సెక్షన్ 90లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. ఆ ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో తామే త్వరిగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పీపీఏతో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. కానీ, చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తమకే అప్పగించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాసింది. దీనివల్ల 2015 ఆఖరివరకూ ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనుల్లో కదలిక లేకుండా పోయింది. ఈ అంశంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించాలంటూ తాము ఎలాంటి లేఖ రాయలేదని.. లేఖ రాసినట్లు నిరూపించాలంటూ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు.
ప్రాజెక్టు పనులు సబ్‌కాంట్రాక్టర్ల పరం
రాష్ట్రంలో 2016లో ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇది పసిగట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబుతో పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ప్రస్తావనే లేకపోవడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఎం చంద్రబాబు మాత్రం లేని ప్యాకేజీని ఉన్నట్లు చూపిస్తూ, దాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు చేయడం విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 7న నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ, 8న జారీ చేసిన ప్రకటనలోనూ విస్పష్టంగా ఉండడం గమనార్హం.
పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా భరిస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇస్తే.. ప్రత్యేక ప్యాకేజీలో మాత్రం 2010–11 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే భరిస్తామని ప్రకటించింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్ 1 తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి చేసే ఖర్చును మాత్రమే భరిస్తామని తేల్చి చెప్పింది. దీనివల్ల 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించాల్సిన జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం రూ.4,205.66 కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం అప్పగించిన మరుసటి రోజే హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.1,481 కోట్లు పెంచేసి.. ట్రాన్స్‌ట్రాయ్‌ను అడ్డుపెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర సర్కారు తీరుపై అసంతృప్తి సెగలు
నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాక కూడా పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిర్దేశించిన మేరకు పురోగతి లేదని ఇటీవల మసూద్ హుస్సేన్ కమిటీ తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం, నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు మరోసారి వ్యూహం రచించారు. శాసనసభలో పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ... ‘‘పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగించాలని మనమై మనం కోరుకోలేదు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే సమయంలో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సిఫార్సుల మేరకు కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది’’ అంటూ సభను తప్పుదోవ పట్టించారు.