
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నియమించిన యూనివర్సిటీల పాలక మండలి సభ్యులు ఇంకా కొనసాగడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆ మండళ్ల కాలపరిమితి ముగిసినా ఎన్నికల ముందు మరో దఫా కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని కొనసాగించడం ద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ఇలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ పాలక మండళ్లు అక్రమ నిర్ణయాలు తీసుకోకముందే వీటిని రద్దుచేయాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ సానుభూతిపరుల నియామకాలన్నీ అక్రమం
రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో 2010లో ఉమ్మడి రాష్ట్రంలో వర్సిటీల పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత వివిధ కారణాలతో పాలక మండళ్లను నియమించలేదు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాలకు కొలీజియం కమిటి సిఫార్సులు లేకుండగానే పాలక మండలి సభ్యులుగా తమ అనుయాయులను నియమించింది. దీనిపై అప్పట్లో రాష్ట్ర గవర్నర్‌కు, మానవ హక్కుల కమిషన్‌కు పలువురు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ పాలక మండలి సభ్యుల పదవీకాలం 2019 ఫిబ్రవరితో ముగిసింది. అయితే ఫిబ్రవరి 25న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడిగా ఫిబ్రవరి 24న పాలక మండలి సభ్యుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
విచిత్రమేమిటంటే మరో నాలుగు నెలల్లో రిటైరయ్యే సభ్యుల పదవీ కాలాన్ని కూడా పొడిగించారు. ఈ కమిటీల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజాకిరణ్, జీఎమ్మార్ గ్రూప్స్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతో సహ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను కూడా నియమించారు. చంద్రబాబు ప్రచారానికి తప్ప గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా వారు సమావేశానికి రాకపోయినా, ఆ సభ్యుల పదవి కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లను నియమాలకు విరుద్ధంగా పాలక మండలి సభ్యులుగా నియమించారు. అధ్యాపకుల కోటాలో నాగార్జున వర్సిటీలో ఒక లైబ్రేరియన్‌ను నిబంధనలకు విరుద్ధంగా పాలక మండలి సభ్యునిగా నియమించారు.
ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నిర్ణయాలు
ఈ పాలక మండళ్లు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే తీర్మానాలు చేశాయి. ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సమావేశానికి ఎక్స్‌ఆఫీషియో సభ్యులు, ప్రభుత్వ ఉన్నతవిద్య కార్యదర్శి హాజరు కాకుండానే అనంతపురం జేఎన్‌టీయూ పాలక మండలి ఆమోదించింది. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం ఓ ప్రైవేట్ క్లబ్‌లో నిర్వహించడం వివాదాస్పదమైంది. శ్రీవేంకటేశ్వర, ఆదికవి నన్నయ్య, కృష్ణా విశ్వవిద్యాయాల్లో పాలక మండలి సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వర్సిటీల పరువును బజారుపాలు చేశాయి.
తక్షణమే రద్దు చేయవచ్చు అంటున్న చట్టం
విశ్వ విద్యాలయ చట్టం ప్రకారం పాలక మండలి సభ్యుల పదవికాలం సాధారణంగా మూడు సంవత్సరాలలో ముగుస్తుంది. గవర్నర్ ఎప్పుడైనా పాలక మండళ్లను రద్దు చేసేలా విశ్వవిద్యాలయాల చట్టంలో ఉంది. చట్టానికి విరుద్ధంగా ఆరు నెలలపాటు పొడిగించిన పాలక మండలి సభ్యులను వెంటనే రద్దు చేయాలనీ, నూతన ప్రభుత్వ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కొత్త వారిని నియమించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా కొనసాగుతున్న రిజిస్ట్రార్లు
గత ప్రభుత్వ హయాంలో పాలక మండళ్లను ఏర్పాటుచేసిన వెంటనే అప్పటి వరకు కొనసాగుతున్న వర్సిటీల రెక్టార్లను, రిజిస్ట్రార్లను తొలగించింది. వారి స్థానంలో అనుభవంలేని వారిని, తమ పార్టీ అనుచరులను సామాజికవర్గం ప్రాతిపదికన చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రార్లు, రెక్టారులుగా నియమించింది. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ, శ్రీవేంకటేశ్వర వర్సిటీ, రాయలసీమ వర్సిటీ, జేఎన్‌టీయూ అనంతపురం రిజిస్ట్రార్లు ప్రభుత్వం మారిన వెంటనే రాజీనామా చేశారు. రాష్ట్రంలోని మిగతా వర్సిటీలలోని అప్పటి రిజిస్ట్రార్లు ఇంకా కొనసాగుతున్నారు. ఈ రిజిస్ట్రార్లపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంటెలిజెన్సు రిపోర్టులు, ఉపకులపతి సిఫార్సుల ఆధారంగా రిజిస్ట్రార్లు, రెక్టార్లను నియమించాలి. కానీ గత ప్రభుత్వ హయాంలో కేవలం సీఎం కార్యాలయంలోని ఒక సలహాదారు సిఫార్సుల మేరకే వీరి నియామకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment