
చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదిగా ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పథకం అమలు చేశారా అని ప్రశ్నించారు. రైతు, డ్వాక్రా మహిళల రుణ మాఫీ విషయంలో మోసం చేసింది చాల క విజయవాడలో నవ నిర్మాణ దీక్ష చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
అది నయవంచన దీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి గద్దె దించి రాజకీయ కుట్రకు పాల్పడిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో రేవంత్‌రెడ్డి పాల్పడిన ఓటుకు నోటు కుట్ర గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ఎంత సేపూ జగన్‌పై నిందారోపణలు చేశారని, ఇది చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.