అత్యాధునిక హంగులు.. తక్కువ ధరకే అపార్‌టమెంట్ ఫ్లాట్లంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో కొందరు బిల్డర్లు మధ్యతరగతి కుటుంబీకులను మోసగిస్తున్నారు.
►ఒక ఫ్లాట్‌కు నాలుగైదు రిజిస్ట్రేషన్‌లు
►రూ.కోట్లలో మోసగించాడని
►బాధితుల లబోదిబో
►నిందితుడికి ఓ పోలీస్ అధికారి అండ?
గుంటూరు క్రైమ్ : అత్యాధునిక హంగులు.. తక్కువ ధరకే అపార్‌టమెంట్ ఫ్లాట్లంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లతో కొందరు బిల్డర్లు మధ్యతరగతి కుటుంబీకులను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసాలపైనే ఎక్కువగా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఒకే ప్లాట్‌ను నలుగురైదుగురికి చూపి.. వారివద్ద భారీగా డబ్బు దండుకుని దొంగ రిజిస్ట్రేషన్‌లు చేస్తున్న వైనం తాజాగా పోలీసుల దృష్టికి వచ్చింది.
స్థానిక ఎస్‌వీఎన్ కాలనీ, విద్యానగర్‌లో నిర్మాణం సగంలో ఆగిపోయిన అపార్ట్‌మెంట్‌లకు సంబంధించి ప్లాట్‌ల కోసం డబ్బు కట్టినవారు మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఓ బిల్డర్ మోసాలపై ఏడాది క్రితం పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు, గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో నిందితుడైన బిల్డర్‌ను అరెస్ట్‌చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వున్నాయి. నిందితుడికి ఓ పోలీస్ అధికారి అండ ఉందనే ఆరోపణలు లేకపోలేదు.
మోసం చేసిందిలా...
ఆకురాతి శ్రీనివాసరావు అనే బిల్డర్ గుంటూరు నగరంలో రెండుచోట్ల అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలను మొదలుపెట్టారు. స్థానిక ఎస్‌వీఎన్ కాలనీ, విద్యానగర్‌లలో సాయిద్వారకా గిరిధామ్, వెంకటసాయి రెసిడెన్సీ పేరుతో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నామని .. రెండు, మూడు గదుల పడకగదులతో హాలు, వంట గది, అటాచ్డ్ బాత్రూమ్ సౌకర్యాలతో లగ్జరీ ప్లాట్‌లంటూ బుకింగ్‌లు చేశారు. నగరంలో 85 మందిపైగా వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒకే ఫ్లాట్‌ను ఒకరికి తెలియకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్‌లు చేయడం, కొందరి వద్ద అడ్వాన్స్‌లు వసూలుచేశారు.
ఈ విధంగా ఒక్కో ఫ్లాట్‌ను నలుగురైదుగురు రిజిస్ట్రేషన్ చే యించుకుని డబ్బులు కట్టారు. రెండు అపార్ట్‌మెంట్లపై ఇలా వసూలు చేసిన మొత్తం సుమారు రూ.16 కోట్లు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. తెనాలికి చెందిన జి.బిక్షంరెడ్డి టాంజేనియా దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ పదేళ్లుగా అక్కడే భార్యాపిల్లలతో నివాసం వుంటున్నారు. విద్యానగర్‌లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ల విక్రయాలు జరుగుతున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్నారు. బిల్డర్ శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి అన్ని వసతులతో పూర్తిచేసి ఇచ్చేలా రూ.32 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
బంధువుల ద్వారా విడతల వారీగా గతేడాది రూ. 30లక్షలు చెల్లించారు. గతేడాది నవంబరులో గుంటూరు వచ్చిన బిక్షంరెడ్డి ఫ్లాట్ చూసేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. అప్పటికే అతనికి కేటాయించిన ఫ్లాట్ మరొకరికి విక్రయంచినట్లు తెలియడంతో మోసపోయామని గుర్తించారు. ఈ తరహాలోనే మరో ఐదుగురు కూడా తమను బిల్డర్ మోసం చేశాడంటూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావుపై కేసులు నమోదయ్యాయి.
అరెస్టులో జాప్యం ఎందుకో?
ఈక్రమంలో తనపై నమోదైన కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టకుండా వుండేలా బిల్డర్ శ్రీనివాసరావు గత డిసెంబరులో కోర్టును ఆశ్రయించి స్టే పొందాడు. స్టే గడువు కూడా గతనెల మూడో తేదీతో ముగిసింది. అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓపోలీస్ అధికారితో శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలు వున్నందు వలన అతని ఆచూకీ తెలిసినప్పటికీ సంబంధిత పోలీసు అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సాహసించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.