సాక్షి, ప్రొద్దుటూరు: చిన్నశెట్టిపల్లె గ్రామానికి సంబంధించి రెండు వర్గాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటోంది. సమస్యను పరిష్కరించకపోతే గత పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి పొట్టిపాడు గ్రామం వద్ద మైలవరం ఉత్తర కాలువ వెంబడి రోడ్డు పనులు చేపడుతున్నారు. గత ఏడాది మార్చి నెలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు ప్రారంభించారు. పనుల అంచనా వ్యయం రూ.1,33,421 మాత్రమే. ఈ పనుల్లో భాగంగా ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గానికి చెందిన బయపురెడ్డి సూర్యనరసింహారెడ్డి పొలంలో కాలువ నీరు వెళ్లేందుకు పైపులు ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ప్రభాకర్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు పొలంలో పైపులు వేస్తున్నాడని సూర్యనరసింహారెడ్డి భావించారు. ముందుగా ఈ విషయంపై చెప్పినా పనులు ఆపకపోవడంతో ఇరువర్గాల మధ్య పొలంలోనే ఘర్షణ చోటుచేసుకుంది. ఈక్రమంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్‌స్టేషన్ వద్ద ఇరు వర్గాలు రాళ్లు కూడా విసురుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటన జిల్లాలో చర్చాంశనీయంగా మారింది.
అప్పటి హోం మంత్రి చినరాజప్ప వరకు వెళ్లిందంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. పనుల నాణ్యతపై ఇటీవల ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రెండు వారాల క్రితం స్వయంగా పనులను పరిశీలించి వెళ్లారు. మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ మరోమారు రోడ్డుపై గ్రావెల్ పరిచారు. అలాగే వివాదానికి సంబంధించిన స్థలంలో మాత్రం పనులను పూర్తి చేయకుండా పైపులను అలానే వదిలేశారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇరువర్గాల మధ్య మళ్లీ ఈ పనులకు సంబంధించిన వివాదం ఏర్పడింది. ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్టర్ పనులు చేస్తున్నా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రభాకర్‌రెడ్డి ప్రత్యర్థి వర్గీయులు చెబుతున్నారు. పనులు పూర్తి చేయకుండా ఎందుకు అసంపూర్తిగా వదిలేశారని ప్రశ్ని స్తున్నారు. ఈ విషయంపై పీఆర్ ఏఈ మల్లారెడ్డిని వివరణ కోరగా తాను ఇటీవలే బదిలీపై వచ్చానని, తనకు వివరాలు తెలియదని చెప్పారు. సూర్యనరసింహారెడ్డి పొలం వద్ద అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులు
Comments
Please login to add a commentAdd a comment